పేరుకు అది తోట చంద్రశేఖర్ కు చెందిన ఛానెల్ కావొచ్చు. కానీ ఆ ఛానెల్ అతడి చేతికి రావడానికి కర్త, కర్మ, క్రియ మొత్తం పవన్ కల్యాణ్. ఇప్పటికీ ఆ ఛానెల్ ను పవన్ కల్యాణ్ ఛానెల్ గానే చూస్తారు జనం.
మొన్న ఎన్నికల్లో జనసేన పార్టీకి ఈ ఛానెల్ లో జరిగినంత ప్రచారం, మరే మీడియా సంస్థలో జరగలేదు. అదే 99టీవీ. పవన్ కు చెందిన ఈ ఛానెల్ లో ఇప్పుడు అరాచకం రాజ్యమేలుతోంది.
99 ఛానెల్ లో 4 నెలలుగా ఉద్యోగులకు జీతాల్లేవ్. ఇదేంటని ప్రశ్నిస్తే సమాధానం లేదు. అసలు మేనేజ్ మెంట్ ఎక్కడుంటుందో కూడా అర్థంకాని పరిస్థితి. గట్టిగా అడిగితే పొమ్మంటున్నారు. ఇదీ ప్రస్తుతం ఈ ఛానెల్ లో ఉద్యోగుల పరిస్థితి.
ఇప్పటికే ఎక్స్ ప్రెస్ టీవీ లాంటి పలు ఛానెళ్లు మూతపడి, కుటుంబాలతో సహా ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇప్పుడు పవన్ టీవీ పరిస్థితి కూడా అదే దారిలో ఉందంటున్నారు చాలామంది.
నిజానికి ఈ ఛానెల్ ను అమ్మకానికి పెట్టినట్టు చాన్నాళ్ల కిందటే వార్తలొచ్చాయి. ఇంకా చెప్పాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే, పవన్ ఇక ఎంతమాత్రం రింగ్ మాస్టర్ కాదని తేలిన వెంటనే ఈ ఛానెల్ అమ్మకంపై చర్చలు ప్రారంభమయ్యాయి.
జనసేన పార్టీకి మీడియా సపోర్ట్ అవసరమే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛానెల్ ను నడిపించడం తనవల్ల కాదని సన్నిహితుల వద్ద చేతులెత్తేశారట తోట.
పవన్ కు కొమ్ము కాస్తున్న ఈ ఛానెల్ చాన్నాళ్లుగా అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఎవరు దక్కించుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది.
మొన్నటివరకు ఓ బడా పారిశ్రామికవేత్తతో చర్చలు జరిపింది యాజమాన్యం. ఏమైందో ఏమో మళ్లీ సైలెంట్ అయింది. ఈలోగా జీతాలు ఇవ్వకుండానే ఇలా ఉద్యోగులతో అక్రమంగా పనులు చేయించుకుంటున్నారు.
ఈ విషయం పవన్ వరకు వెళ్లినప్పటికీ జనసేనాని చూసీచూడనట్టు ఉంటున్నారట. మైక్ దొరికితే అదేపనిగా జనసైనికులకు హితబోధ చేసే పవన్ కల్యాణ్.. తన ఛానెల్ లో జరుగుతున్న ఈ అన్యాయాన్ని మాత్రం ప్రశ్నించడం లేదు, సరికదా కనీసం గుర్తించడం కూడా లేదు.
ఎన్నికల ఫలితాల తర్వాత మీడియాలో చాలా మార్పుచేర్పులు జరుగుతాయని, కుదుపులు సంభవిస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు. ఆ అంచనాలకు తగ్గట్టే పలు మీడియా సంస్థల్లో నష్టాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు 99టీవీ వ్యవహారం బయటపడింది.. భవిష్యత్తులో మరిన్ని చిన్న ఛానెళ్లు ఇలా రోడ్డున పడబోతున్నాయి.