ప్రభుత్వ కార్యాలయంలో పట్టపగలు ఓ మహిళా తహశీల్దారును హత్యచేసిన ఘటన హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగింది. రామోజీ ఫిలింసిటీకి కూతవేటు దూరంలో ఉండే ఈ కార్యాలయంలో ఈరోజు జరిగిన ఈ దారుణం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారణాలేంటనేది అంతుచిక్కకుండా ఉంది.
ఎప్పట్లానే పొద్దున్నే ఆఫీస్ కు వచ్చారు తహశీల్దారు విజయారెడ్డి. తను రెగ్యులర్ గా చేస్తున్న పనులన్నీ చక్కపెట్టారు. మధ్యాహ్నం అయింది. ఆఫీస్ లో సందడి తగ్గింది. సిబ్బంది భోజనాలకు రెడీ అవుతున్నారు. సరిగ్గా అప్పుడే కార్యాలయంలోకి ప్రవేశించాడు ఓ దుండగుడు. ఏం జరుగుతుందో ఊహించేలోపే, తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్ ను విజయారెడ్డిపై పోసి నిప్పంటించాడు.
దీంతో ఒక్కసారిగా ఆమె హాహాకారాలు చేసుకుంటూ తలుపు వరకు పరుగెత్తుకుంటూ వచ్చింది. వెంటనే గమనించిన సిబ్బంది ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే మంటలు చుట్టుముట్టాయి. తహశీల్దారు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ క్రమంలో ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన మరో ఇద్దరు సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
తహశీల్దారును హత్యచేసిన అగంతుకుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనపై కూడా కిరోస్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దుండగుడు ఎందుకు దాడికి పాల్పడ్డాడు, విజయారెడ్డిని నిజంగానే హత్య చేయాలని అనుకున్నాడా లేక భయపెట్టడానికి ప్రయత్నించాడా? అనేది విషయాలు తేలాల్సి ఉంది.
ఈ ఘటన ఇప్పుడు తెలంగాణ అంతటా పెద్ద చర్చకు దారితీసింది. ప్రభుత్వం కార్యాలయాల్లో సిబ్దంది రక్షణను అగమ్యగోచరంగా మార్చింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అత్యంత ప్రాధాన్యత అంశం కింద తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.