తెగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించేసి, ఫడ్నవీస్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిద్దామంటే.. ప్రభుత్వం కూలిపోతుందనే భయం బీజేపీకి ఉంది. ఇది వరకూ కర్ణాటకలో ముందుగా బలం లేకుండానే యడ్యూరప్పను సీఎంగా చేశారు. రెండు రోజులకే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది!
కర్ణాటకతో పోలిస్తే మహారాష్ట్రలో మెజారిటీకి బీజేపీ చాలా చాలా దూరంలో ఉంది. తమను బెదిరిస్తున్న శివసేనను ఇది వరకటిలా లైట్ తీసుకోలేక, ఆ పార్టీ షరతులకు తలొగ్గలేక బీజేపీ సతమతమవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజారిటీతో బలవంతుడిలా కనిపించిన బీజేపీ పాలిట శివసేన ఇప్పుడు చలిచీమలా తయారైంది!
అసలే తమను తాము పులితో పోల్చుకుంటారు శివసేన వాళ్లు. వాళ్ల జెండాలోనే పులి ఉంటుందాయె. వాళ్ల గుర్తు రామబాణం! వాళ్లు వేసుకునేది కాషాయ కండువా! కాబట్టి ఎలా బద్నాం చేద్దామన్నా శివసేనను దెబ్బతీయడం బీజేపీకి అంత తేలిక కాదు.
ఎన్సీపీ మద్దతు తీసుకుంటే అంత కన్నా సిగ్గుమాలిన తనం ఉండదాయె. అసలే ఎన్సీపీకి న్యాచురలీ కరప్టెడ్ పార్టీ అంటూ బిరుదును ఇచ్చింది స్వయానా మోడీనే! ఫడ్నవీస్ ఢిల్లీ వెళ్లారు. అమిత్ షాతో సమావేశం అయ్యారు.
అయితే అమిత్ షా చాణక్యం ఇప్పుడు ప్రదర్శించలేకపోతున్నారు! అమిత్ షా అలా రంగంలోకి దిగారంటే ఇలా అన్నీ సెట్ అయిపోతాయని బీజేపీ వాళ్లు చెప్పుకునే వాళ్లు. ఇప్పుడు ఒక రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా నిలిచి కూడా, ఫలితాలు వచ్చిన పది రోజులకు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందడుగు వేయలేకపోతున్నారు.
ఇందు మూలంగా బీజేపీ అర్థం చేసుకోవాల్సిన నీతి ఏమిటంటే.. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజలు ఇచ్చే తీర్పే మోడీని అయినా అమిత్ షాను అయినా పాలకులను చేస్తుంది. అంతే కానీ.. వారేమీ పుట్టుకతో రాజులు కాదు, పుట్టుకతో చాణుక్యులు కాదు… ప్రజలు మద్దతు ఇస్తేనే వాళ్లు పవర్ ఫుల్ అని వారే గ్రహిస్తే బీజేపీకే ఒకందుకు మంచిది!