రోడ్డు షోలు, బహిరంగ సభలు నిర్వహించొద్దంటూ జగన్ సర్కారు తాజాగా తీసుకొచ్చిన జీవోను ప్రతిపక్షాలు, టీడీపీ అనుకూల మీడియా “చీకటి జీవో” అంటూ అభివర్ణిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ వ్యూహం ప్రకారం చంద్రబాబు రోడ్డు షోలు, బహిరంగ సభలు నిర్వహించాలి. ఆయన తనయుడు లోకేష్ పాదయాత్ర చేయాలి. పాదయాత్రకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ ఈలోగానే … చంద్రబాబు నిర్వహించిన రెండు సభల్లో 11 మంది మృత్యువాత పడ్డారు. దీనిని తనకు అనుకూలంగా మలచుకున్న జగన్ సర్కార్ బాబు పర్యటనలు, సభలను అడ్డుకునేందుకు ఏకంగా జీవో జారీ చేసింది. రోడ్లపై, రద్దీ ప్రదేశాల్లో సభలు నిర్వహించొద్దనేది ఆ జీవో ఆంతర్యం. చంద్రబాబు మూడు రోజుల పర్యటన కోసం కుప్పం చేరుకున్నారు.
అప్పటికే టీడీపీ శ్రేణులు – పోలీసుల మధ్య పలు ప్రాంతాల్లో వాగ్వాదం చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రచార వాహనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సభా ప్రాంగణానికి అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 మేరకు రోడ్ షో లకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఇక, చంద్రబాబు బెంగుళూరు వినామాశ్రయం నుంచి కుప్పం కు చేరుకొనే క్రమంలో శాంతిపురం మండలం 121 పెద్దూరు వద్దకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, చంద్రబాబు సహనం కోల్పోయారు. పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. జీవోలోని లోపాలను ప్రస్తావించారు. తనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు కారణాలతో లిఖిత పూర్వకంగా చెప్పాలని డిమాండ్ చేసారు.
తన నియోజకవర్గంలో తననే తిరగనివ్వరా అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. పర్యటన ఆపేది లేదని భీష్మించారు. చివరకు పోలీసు ఆంక్షలతో సభలు రద్దుచేసుకున్నారు. కానీ, మరో బాట ఎంచుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం పైన నిరసన వ్యక్తం చేసి.. ప్రతిపక్షాల మద్దతు సంపాదించిన చంద్రబాబు కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. కుప్పంలో సభలను రద్దు చేసుకున్నారు. ఇక, ముందుగా కార్యక్రమాలు నిర్వహించిన ప్రాంతాల్లో పాదయాత్రకు డిసైడ్ అయ్యారు. ఒకే చోట రోడ్ షో కు పరిమితం కాకుండా ప్రతీ ఇంటికి వెళ్లాలని నిర్ణయించారు. ప్రతీ ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా శాంతిపురం నుంచే ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. దీని ద్వారా చంద్రబాబును అడ్డుకొనే అవకాశం ఉండదు.
అదే సమయంలో.. చంద్రబాబు ప్రతీ ఇంటికి వెళ్లటం ద్వారా మరింతగా ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి ఆదరణ ఉంటుందనేది పార్టీ నేతల అంచనా. కుప్పంలో 35 ఏళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఇంటింటికి వెళ్లటం ద్వారా వచ్చే ఎన్నికలకు మేలు చేస్తుందని చెబుతున్నారు. రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లటం.. గ్రామాల్లో రచ్చబండ తరహాలో ముఖాముఖి నిర్వహించాలని నిర్ణయించారు.
జగన్ తాను నిబందనల పేరుతో చంద్రబాబును అడ్డుకుంటున్నట్లు భావిస్తున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే పరోక్షంగా బాబుకు మేలు చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఆంక్షల పేరుతో పోలీసులతో బాబాబును అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సర్కార్ పరోక్షంగా బాబుపై ప్రజల్లో సానుభూతి పెంచుతోంది. ఈ రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో చూడాలి.