మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబునాయుడికి ఏపీ సర్కార్ విపరీతమైన పబ్లిసిటీ ఇస్తోంది. ఎంత డబ్బు చెల్లించినా …బాబుకు ఈ రేంజ్‌లో ప్రచారం దక్కేదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జీవో-1 ఉద్దేశం మంచిదే. అయితే అమలు విషయానికి వచ్చే సరికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అసలే చంద్రబాబు దేన్నైనా తనకు అనుకూలంగా మలుచుకునే నేర్పరితనం వున్న నాయకుడు. ఇక ప్రభుత్వమే అవకాశం కల్పిస్తే…. అవకాశాన్ని జారవిడుచుకుంటారా? టీడీపీ కోరుకున్నట్టుగానే ఏపీ సర్కార్ వ్యవహరిస్తోంది.
కుప్పం చంద్రబాబు సొంత నియోజకవర్గం. మూడు రోజులు పర్యటించాలని నెల క్రితమే నిర్ణయించుకున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరు, అలాగే గుంటూరులలో చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. బాబు ప్రచార యావతోనే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయనే ప్రత్యర్థుల విమర్శలు జనాల్లోకి వేగంగా వెళ్లాయి.
చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి అని అందరికీ తెలుసు. దీంతో వైసీపీ నేతల విమర్శలను తటస్థులు, మేధావులు, విద్యావంతులు కూడా ఔనని ఊకొట్టే పరిస్థితి. దీన్నే మరింత బలంగా జనంలోకి తీసుకెళ్లేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి వుంటే ఆ పార్టీకి రాజకీయంగా బాగుండేది. అబ్బే…అట్లా చేస్తే వైసీపీకి మంచి జరుగుతుందని అనుకున్నారేమో…తమకు తామే నెత్తిన జీవో-1 అనే అస్త్రాన్ని పెట్టుకున్నారు. నిజానికి ఈ జీవోలో స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని హరించే నిబంధనలేవీ లేవు.
కానీ చంద్రబాబు సొంత నియోజకవర్గానికి వెళ్లకుండా అడ్డుకున్నారనే అప్రతిష్టను మూటగట్టుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విజయం సాధించింది. 11 మంది మరణాలతో టీడీపీకి, చంద్రబాబుకు వచ్చిన చెడ్డపేరు కూడా కుప్పంలో ప్రతిపక్ష నాయకుడికి అడ్డంకులు సృష్టించడంతో కొట్టుకుపోయిందని వైసీపీ నేతలు తమ అంతర్గత సమావేశాల్లో వాపోతున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనకు అడ్డంకులు సృష్టించకుండా వుంటే…మూడు రోజులు పర్యటన పూర్తి చేసుకుని వెళ్లిపోయేవారు.
పోలీసులతో చంద్రబాబును అడ్డుకోవడం ద్వారా గడపగడపకూ ఆయన్ను తిరిగేలా చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పార్టీ ప్రజాప్రతినిధులనే కాదు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును కూడా గడపగడపకూ వెళ్లేలా చేయగలిగారనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. కుప్పం ఎపిసోడ్ రాజకీయంగా చంద్రబాబుకు ఎంతో ప్రయోజనం కలిగించగా, వైసీపీకి మరింత నష్టదా యకమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాబు ఏదైతే జరగాలని కోరుకుంటున్నారో, ఆ పని వైసీపీ ప్రభుత్వం చేస్తోంది.
చంద్రబాబు ట్రాప్‌లో తమ ప్రభుత్వం నెమ్మదిగా పడుతోందని వైసీపీ పెద్దలు గ్రహిస్తే మంచిది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ… రానున్న రోజుల్లో ఇదే రీతిలో ఏపీ సర్కార్ వ్యవహరిస్తే మాత్రం మూల్యం చెల్లించుకోడానికి సిద్ధం కావాల్సి వుంటుంది.