వైసీపీ సోష‌ల్ మీడియా- సార‌థి – సైన్యం!

వైసీపీ ఎన్నిక‌ల స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో పార్టీ అనుబంధ విభాగాల సార‌థుల‌ను వైసీపీ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇందులో కొంద‌రు పాత‌వాళ్లే ఉన్నారు. ప్ర‌ధానంగా ఈ నియామ‌కాల్లో సోష‌ల్ మీడియా గురించి మాట్లాడుకోవాలి. వైసీపీ…

వైసీపీ ఎన్నిక‌ల స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో పార్టీ అనుబంధ విభాగాల సార‌థుల‌ను వైసీపీ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇందులో కొంద‌రు పాత‌వాళ్లే ఉన్నారు. ప్ర‌ధానంగా ఈ నియామ‌కాల్లో సోష‌ల్ మీడియా గురించి మాట్లాడుకోవాలి. వైసీపీ సోష‌ల్ మీడియా, అలాగే పార్టీ మీడియా కోఆర్డినేట‌ర్‌గా స‌జ్జ‌ల భార్గ‌వ్‌రెడ్డిని నియ‌మించిన‌ట్టు పార్టీ ప్ర‌క‌టించింది. అయితే ఇదేమీ కొత్త విష‌యం కాదు.

గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో స‌జ్జ‌ల భార్గ‌వ్‌రెడ్డికి సోష‌ల్ మీడియా బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్టు వార్త‌లొచ్చాయి. ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కుమారుడే భార్గ‌వ్‌. ఎంబీఏ ప‌ట్ట‌భ‌ద్రుడు. రామ‌కృష్ణారెడ్డికి జ‌ర్న‌లిజం నేప‌థ్యం వుంది. కానీ భార్గ‌వ్‌కు అలాంటివేవీ లేవు. ఎన్నిక‌ల స‌మ‌రంలో సోష‌ల్ మీడియా అత్యంత కీల‌క పాత్ర పోషించాల్సి వుంటుంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌త్య‌ర్థుల‌ను చీల్చి చెండాడంతో పాటు వారికి దీటైన కౌంట‌ర్లు ఇవ్వాల్సి వుంటుంది.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీకి సోష‌ల్ మీడియా ద‌న్నుగా నిలిచింది. వంద‌లాది మంది స్వ‌చ్ఛందంగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి, టీడీపీకి వ్య‌తిరేకంగా ప‌ని చేశారు. జ‌యం జ‌యం చంద్ర‌న్నా అంటూ చంద్ర‌బాబుపై పాట పాడ‌టం, అలాగే టీడీపీ అనుకూల చాన‌ల్ లోకేశ్ విదేశీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా స్వామి భ‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తూ చంద్ర‌బాబును ఆకాశానికి ఎత్తేలా క‌థ‌నం చేయ‌డం, స‌రిగ్గా ఎన్నిక‌ల ముంగిట ఆంధ్ర‌జ్యోతి ఎండీ ఆర్కే, చంద్ర‌బాబు మ‌ధ్య సాగిన ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఉద్యోగ‌, ప్ర‌జల‌కు వ్య‌తిరేకంగా ఉందంటూ పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు.

అలాగే చంద్ర‌బాబు నేతృత్వంలో రాష్ట్రానికి ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని, ఎక్క‌డ చూసినా ప‌రిశ్ర‌మ‌లే క‌నిపిస్తున్నాయంటూ ఎల్లో మీడియా చేసిన ప్ర‌చారాన్ని సోష‌ల్ మీడియా బ‌లంగా తిప్పికొట్టింది. జీతాలు ఎల్లో మీడియా కార్యాల‌యాల్లో తీసుకోవాలంటూ వ్యంగ్య పోస్టుల‌ను సృజ‌నాత్మ‌కంగా సోష‌ల్ మీడియాలో ఆవిష్క‌రించి టీడీపీకి చుక్క‌లు చూపించారు. ఇవ‌న్నీ గ‌తం. వ‌ర్త‌మానంలోకి వ‌స్తే… వైసీపీ అధికారంలోకి వ‌చ్చి దాదాపు నాలుగేళ్లు అవుతోంది.

వైసీపీ అధికారంలోకి రావ‌డానికి కీల‌క పాత్ర పోషించిన సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌నే తీవ్ర విమ‌ర్శ‌లున్నాయి. అందుకే వైసీపీ సోష‌ల్ మీడియా బాధ్యుల‌పై కొంత కాలంగా వైసీపీ అనుకూల సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల్లో తీవ్ర అసంతృప్తి, వ్య‌తిరేక‌త వుంది. అది ఎంత‌లా అంటే…ఈ ద‌ఫా వైసీపీకి వ్య‌తిరేకంగా ప‌ని చేయాల‌నేంత‌. కొంద‌రు యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లలో స్వచ్ఛందంగా ప్ర‌భుత్వ అనుకూల‌, ప్ర‌తిప‌క్షాల వ్య‌తిరేక విశ్లేష‌ణ‌లు చేస్తే, అలాంటి వాటిని వైర‌ల్ చేసుకునే దుస్థితిలో వైసీపీ సోష‌ల్ మీడియా వుంద‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో వైసీపీ పెయిడ్ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల కోసం వెతుకులాట మొద‌లు పెట్టింది. మీ చాన‌ల్ లేదా ఇత‌ర‌త్రా సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై తమ పార్టీ కోసం ప‌ని చేస్తే… ఇంత మొత్తం ఇస్తామ‌నే బేర‌సారాలు ఆడుతున్న‌ట్టు స‌మాచారం. గ‌తంలో త‌మ కోసం స్వ‌చ్ఛందంగా ప‌ని చేస్తున్న వాళ్ల‌ను ఇంత‌కాలం ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్లే వైసీపీకి ఈ ఖ‌ర్మ ప‌ట్టింద‌ని అసంతృప్త యాక్టివిస్టులు మండిప‌డుతున్నారు. జ‌గ‌న్‌పై అభిమానంతో ప‌ని చేసే వాళ్ల‌ను విస్మ‌రించ‌డం వ‌ల్ల జ‌రిగిన, జ‌రుగుతున్న న‌ష్టం ఏంటో అధికార పార్టీకి ఇప్పుడిప్పుడే తెలుసొస్తోంది.

ఈ నేప‌థ్యంలో వైసీపీ సోష‌ల్ మీడియాకు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కుమారుడు సార‌థి కావ‌డం గ‌మ‌నార్హం. ఇక సైన్యాన్ని నియ‌మించుకోవ‌డంలోనే అస‌లుసిస‌లు క‌థ వుంది. న‌మ్ముకున్న వాళ్ల‌ను గాలికొదిలేసి, రాత‌లను, విజువ‌ల్స్‌ను అమ్ముకునే వాళ్ల కోసం వైసీపీ సోష‌ల్ మీడియా వెతుక్కోవ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి వాళ్ల‌ను పెట్టుకుని ఎంత వ‌ర‌కూ స‌క్సెస్ అవుతారో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.