నిర్మాతల వారసురాళ్లు పరిశ్రమలోకి రావడం కొత్తే కాదు. అశ్వనీదత్ కుమార్తెలు ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్నారు. తాజాగా దిల్ రాజు కుమార్తె కూడా సినిమా రంగంలోకి వచ్చారు. ఇక మెగా కుటుంబం నుంచి సుశ్మిత, నిహారిక నిర్మాతలుగా వస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి చినబాబు కుమార్తె హారిక కూడా చేరారు.
చినబాబు పేరు చెప్పగానే అల వైకుంఠపురములో, అ..ఆ, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి మంచి సినిమాలు గుర్తొస్తాయి. ఈయన వారసత్వంతో వస్తున్న హారిక కూడా అలాంటి ఓ మంచి సబ్జెక్ట్ ను సెలక్ట్ చేసుకొని ఉంటారని అంతా అనుకున్నారు. కానీ హారిక మాత్రం అడల్ట్ కామెడీ చిత్రంతో నిర్మాతగా మారారు.
చినబాబు కుమార్తె, నాగవంశీ సోదరి హారిక నిర్మాతగా మారి తీసిన సినిమా పేరు మ్యాడ్. త్రివిక్రమ్ భార్య సాయిసౌజన్యతో కలిసి ఆమె ఈ సినిమా నిర్మించారు. ఇందులో హీరోలు, హీరోయిన్లు ఎవరనేది అప్రస్తుతం. కంటెంట్ ఏంటనేది ముఖ్యం. ఇద్దరు మహిళా నిర్మాతలు కలిసి కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఓ పచ్చి బూతు సినిమా తీశారు. కొద్దిసేపటి కిందట రిలీజైన టీజర్ చూస్తే, సినిమా కంటెంట్ ఏంటనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు.
సరిగ్గా ఇక్కడే దిల్ రాజు కుమార్తెకు, చినబాబు కుమార్తెకు మధ్య పోలిక తెస్తున్నారు చాలామంది. రీసెంట్ గా దిల్ రాజు కుమార్తె హన్సిత కూడా నిర్మాతగా మారారు. ఆమె నిర్మించిన తొలి చిత్రం బలగం. ఆ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని కదిలించిన చిత్రమది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకూ రానన్ని అంతర్జాతీయ అవార్డుల్ని గెలుచుకున్న హార్ట్ టచింగ్ మూవీ అది.
మరీ ఆ స్థాయిలో కాకపోయినా, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఓ మంచి కుటుంబకథా చిత్రంతో హారిక నిర్మాతగా పరిచయమైతే బాగుండేది. యూత్ సినిమానే తీయాలనుకుంటే, బూతులు లేకుండా కూడా తీయొచ్చు. కనీసం ఆ ప్రయత్నం కూడా జరగలేదు. మ్యాడ్ టీజర్ చూస్తుంటే.. హారిక-హాసిని, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ల స్థాయికి ఏమాత్రం సరిపోని సినిమాగా అనిపిస్తోంది.
ఈ 2 బ్యానర్లకు గాడ్ ఫాదర్ త్రివిక్రమ్. ఆయన అనుమతి లేకుండా ఈ బ్యానర్లపై ఏ సినిమా పట్టాలపైకి రాదు. సో.. ఈ అడల్ట్ కామెడీ సినిమాకు కచ్చితంగా త్రివిక్రమ్ ఆమోదముద్ర పడే ఉంటుంది.