ఆంధ్రప్రదేశ్ సీఎస్ .. ఆకస్మిక బదిలీ!

ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ చేత సీఎస్ గా నియమించబడిన ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఎన్నికల సమయంలో రాజకీయాల్లో బాగా నానిన పేరు ఎల్వీ సుబ్రమణ్యం. ఆయనను సీఎస్ గా…

ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ చేత సీఎస్ గా నియమించబడిన ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఎన్నికల సమయంలో రాజకీయాల్లో బాగా నానిన పేరు ఎల్వీ సుబ్రమణ్యం. ఆయనను సీఎస్ గా నియమించడం పట్ల అప్పట్లో తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది.

ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడి అనుకూల అధికారుల బదిలీలు కొన్ని జరిగాయి. అది ప్రతి సారీ జరిగేదే. అంత వరకూ ముఖ్యమంత్రులతో అతి సన్నిహితంగా వ్యవహరించిన కీలక అధికారులను ఎన్నికల కమిషన్ ఎన్నికల వేళ బదిలీ చేస్తూ ఉంటుంది. వైఎస్  హయాంలో కూడా అలాంటి బదిలీలు జరిగాయి. అయితే ఇటీవలి ఎన్నికల సమయంలో అలా జరిగే సరికి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.

ఎన్నికల కమిషన్ పై దుమ్మెత్తి పోశారు. అలాగే తన ప్రభుత్వమే ఛాయిస్ గా ఇచ్చిన ఎల్వీ సుబ్రమణ్యాన్ని సీఎస్ గా నియమించడం పట్ల చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఇక చంద్రబాబు నాయుడు కోరినట్టుగా కేబినెట్ భేటీకి సహకరించక లేదు ఎల్వీ సుబ్రమణ్యం. పోలింగ్ ముగిశాకా అందుకు సంబంధించి రచ్చ జరిగింది.

ఇక వైఎస్ జగన్ సీఎం అయ్యాకా ఎల్వీ సుబ్రమణ్యం సీఎస్ గా కొనసాగారు. మరో ఐదు నెలల సర్వీసు ఆయనకు మిగిలినట్టుగా ఉంది. అయితే ఇంతలోనే ఆయన బదిలీ కావడం గమనార్హం.

మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా ఆయనను నియమించారు. కొత్త సీఎస్ ఎవరో ఇంకా స్పష్టత లేదు. కొన్ని అంతర్గత వ్యవహారాలే సీఎస్  బదిలీకి కారణమని పరిశీలకులు అంచనా వేస్తూ ఉన్నారు. తన బదిలీపై ఎల్వీ సుబ్రమణ్యం ఇంకా స్పందించాల్సి ఉంది.