8 వారాల లాక్-ఇన్ పీరియడ్. ఆ తర్వాతే డిజిటల్ వేదికలపై సినిమాలు. సరిగ్గా 7 నెలల కిందట నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం ఇది. తెలుగు సినిమాను, థియేటర్లను కాపాడుకునేందుకు అంతా సమష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నాని అప్పట్లో మండలి పెద్దలు ఘనంగా చెప్పుకున్నారు. చెప్పినట్టుగానే కొన్ని సినిమాలకు ఆ రూలు విధించారు.
అప్పట్లో మజిలీ లాంటి సినిమాలు 8 వారాల తర్వాతే థియేటర్లలోకి వచ్చాయి. కానీ ఇప్పుడీ నిబంధన గాల్లో కలిసిపోయింది. నిర్మాతలంతా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు వ్యవహరించడం మొదలుపెట్టారు.
ఆపరేషన్ గోల్డ ఫిష్.. ఆది సాయికుమార్ నటించిన ఈ సినిమా మొన్ననే థియేటర్లలోకి వచ్చింది. అంతలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ప్రత్యక్షం.
చాణక్య.. గోపీచంద్ నటించిన ఈ సినిమా విడుదలై నెల కూడా కాలేదు. ఇప్పుడు ఆన్ లైన్ లో సిద్ధంగా ఉంది. ఈ రెండు మాత్రమే కాదు.. సందీప్ కిషన్ నటించిన నిను వీడని నేను సినిమా కూడా లాక్-ఇన్ పీరియడ్ కు ముందే ఆన్ లైన్లో ప్రత్యక్షమైంది.
కేవలం చిన్న సినిమా నిర్మాతలే ఇలా వ్యవహరిస్తున్నారనుకుంటే పొరపాటు. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఇలానే అమ్మేశారు.
అటు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు కూడా సాహో సినిమాను రిలీజైన 50 రోజులకే అమెజాన్ ప్రైమ్ లో పెట్టేలా అనుమతులు ఇచ్చేశారు. ఇలా చిన్నాపెద్దా తేడాలేకుండా నిర్మాతలంతా కలిసి తాము తీసుకున్న నిర్ణయాన్నే తామే ఇలా తుంగలో తొక్కారు.
ఇంతకుముందు 3 వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఇచ్చేసేవారు. నిర్మాతలు ఇచ్చేశారు అనేకంటే.. అమెజాన్ ప్రైమ్ లాంటి సంస్థలు అలా ఒప్పందాలు కుదుర్చుకున్నాయనడం కరెక్ట్. దీనివల్ల థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గిపోయింది.
ఓ 3 వారాలు ఆగితే ఇంట్లో చూసుకోవచ్చనే ఫీలింగ్ కు జనాలు థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. ఇక్కడితో ఆగలేదు. ప్రీ-రిలీజ్ బిజినెస్, శాటిలైట్ మార్కెట్ పై కూడా దీని ప్రభావం పడింది. దీంతో నిర్మాతల మండలి 8 వారాల లాక్-ఇన్ పీరియడ్ ను విధించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అప్పట్లో హెచ్చరించింది. అయినప్పటికీ షరా మామూలే.