కొత్తకృష్ణుడు రంగప్రవేశం చేసినంత మాత్రాన రంగస్థలం మీద ప్రదర్శించే నాటకంలో స్క్రిప్టు మారిపోదు. సుదీర్ఘమైన నాటకంలో రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు ఎంటరైనా సరే.. నాటకం స్క్రిప్టు ప్రకారమే నడుస్తుంటుంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జిని మార్చినంత మాత్రాన.. ఆ పార్టీలోని ముఠా కుమ్ములాటలు సర్దుకుంటాయా? నాయకులు రచ్చకెక్కకుండా సయోధ్యతో పనిచేయడం అనేది సాధ్యమేనా? అనే చర్చ ఇప్పుడు మొదలవుతోంది.
కాంగ్రెస్ పార్టీ అంటేనే ముఠా తగాదాలకు పెట్టింది పేరు. తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు ఆ వ్యవహారంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఉంటుంది. మామూలుగా అయితే తమలో తాము నిత్యం కలహించుకుంటూనే ఉండే కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు రేవంత్ రెడ్డి ధాటికి ఒక్కటవుతున్నారు. తమ మధ్య అంతగా సయోధ్య లేనివాళ్లు కూడా.. ఏకతాటిపైకి వస్తున్నారు. టీపీసీసీలో అందరిదీ ఒకటే ఎజెండా.. రేవంత్ రెడ్డి పట్ల వ్యతిరేకత.
ఇప్పటికీ ఈ తిరుగుబాటు, అసమ్మతి ముఠాతో కూడా కలవకుండా, తనంతాను సొంతంగా అసమ్మతి జెండా మోసుకుంటున్న వాళ్లు కూడా ఉన్నారు. అయితే వీరందరూ ఇప్పుడు పార్టీకి కొత్త ఇన్చార్జి వచ్చినంత మాత్రాన గాడిలో పడతారా? అనేది ప్రశ్న.టీపీసీసీలో విభేదాలు, రేవంత్ వ్యతిరేకత, అసమ్మతి గళాలు ఇవన్నీ కూడా తొలినుంచి ఉన్నవే. కానీ మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ సారథి అయిన తర్వాత.. పీసీసీ కమిటీలను పునర్ వ్యవస్థీకరిచండంతో ముసలం పుట్టింది.
రేవంత్ వర్గానికి మాత్రమే పెద్దపీట వేశారని, కమిటీల ఏర్పాటులో కనీసం తమను సంప్రదించలేదని ఇలా రకరకాల అలిగే వాళ్లు ఎక్కువయ్యారు. పార్టీకి, పదవులకు రాజీనామాలనుకూడా ప్రకటించారు. అటువైపు పదవులు పొందిన రేవంత్ వర్గీయులు కూడా.. ‘మా పదవులే సమస్య అయితే ఇవి మాకొద్దు’ అంటూ రాజీనామాలు చేయడం ఒక కామెడీ.
ఇలా ముఠా తగాదాలు తారస్థాయికి చేరిన తర్వాత.. ఏఐసీసీ పురమాయింపుతో డిగ్గీరాజా దిగ్విజయ్ సింగ్ రాజీ చర్చల నిమిత్తం హైదరాబాదు వచ్చారు. అన్ని ముఠాలకు చెందిన అందరు నాయకులతోనూ మాట్లాడారు. ఇక్కడ రిపేరు చేయలేనంత ఘోరంగా పరిస్థితులు దెబ్బతిని ఉన్నాయని గ్రహించి.. ఆ మేరకు హైకమాండ్ కు ఒక నివేదిక ఇచ్చి, ఇన్చార్జి మాణికం టాగూర్ ను మార్చడం ఒక తక్షణ పరిష్కారంగా సూచించారు. ఆ మేరకు మాణికం ముందు టీపీసీసీ వాట్సప్ గ్రూపు నుంచి ఎగ్జిట్ కావడం, తర్వాత ఆయన స్థానంలో మాణిక్ రావు ఠాక్రేను నియమించడం జరిగిపోయాయి.
డిగ్గీరాజా నివేదికలో చెప్పినట్టు.. ఇక్కడి ముఠా తగాదాలు చాలా దూరం వెళ్లి ఉన్నాయి. మాణికం ను తీసేసి మాణిక్ రావును తెచ్చినంత మాత్రాన అవి సర్దుకుంటాయా? కమిటీలను మార్చకుండా, ఈ కమిటీలను రద్దు చేసి మళ్లీ కొత్త కమిటీలను ప్రకటించకుండా.. అసలు సయోధ్య దిశగా ఒక్క అడుగైనా సాధ్యమేనా? అని నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.