వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అధికారమనే కోరల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పీకేశారు. కొంత కాలంగా సొంత ప్రభుత్వంపై అనం రామనారాయణరెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆనం వైఖరితో పార్టీకి నష్టం వాటిల్లుతోందని వైసీపీ అధిష్టానం సీరియస్ చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో వెంకటగిరి పార్టీ ఇన్‌చార్జ్‌గా నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డిని నియమించింది.
ఈ నేపథ్యంలో ఒక్క రోజులోనే వెంకటగిరిలో రాజకీయ పరిణామాలు మారాయి. వెంకటగిరి మున్సిపల్ కమిషనర్, నియోజక వర్గంలోని తహశీల్దార్లు, పోలీస్ అధికారులు, అనధికారులు, వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులంతా రాంకుమార్‌రెడ్డి ఇంటికి క్యూ కట్టారని తెలిసింది. ఇక మీదట ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని ప్రతిపక్ష ప్రజాప్రతినిధిగా చూడాలనే రీతిలో ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. అధికార పార్టీ కార్యకలాపాలు ఏవైనా రాంకుమార్‌రెడ్డే చూసుకుంటారని స్పష్టమైన వర్తమానాన్ని అధిష్టానం పంపినట్టు తెలిసింది.
దీంతో వెంకటగిరిలో ప్రజా సమస్యల పరిష్కారం, అలాగే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం, అధికారులకు ఆదేశాలు అన్నీ రాంకుమార్‌రెడ్డి కనుసన్నల్లో జరగనున్నాయి. వెంకటగిరిలో వైసీపీని బలోపేతం చేసే పూర్తి బాధ్యతల్ని రాంకుమార్ భుజాలపై జగన్ పెట్టారు. వెంకటగిరి వైసీపీలో ఇకపై వర్గాలకు స్థానం లేదని, ఉన్నదల్లా జగన్ వర్గమే అని ఇప్పటికే రాంకుమార్‌రెడ్డి ప్రకటించారు.
రాంకుమార్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో రామనారాయణరెడ్డి వ్యవహార శైలి వుంటుందనే చర్చకు తెరలేచింది. అసలే సీఎం జగన్ మీద ఆనం కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇప్పుడు తన వ్యతిరేక వ్యక్తిని ఇన్‌చార్జ్‌గా నియమించడం, అధికారులెవరూ ఎమ్మెల్యే మాట వినకుండా కట్టడి చేసిన పరిస్థితిలో ఆనం రియాక్షన్ రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది.