ఏకంగా 60వ సారి తండ్రి అయ్యాడు. అయినప్పటికీ 60 మంది సంతానం తనకు సరిపోదంటున్నాడు. పిల్లల్ని కనడానికి తనకు మరో భార్య కావాలంటున్నాడు. అతడి పేరు సర్దార్ జాన్ మహ్మద్ ఖాన్ ఖిల్జీ. పాకిస్థాన్ లో ఉంటాడు.
క్వెట్టా నగరంలోని ఈస్టర్న్ బైపాస్ సమీపంలో ఉంటాడు ఈ వ్యక్తి. స్థానికంగా ఇతడు ఓ వైద్యుడు. పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే ఏకంగా ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ల ద్వారా 60 మంది సంతానాన్ని పొందాడు. అయితే 60 మంది పిల్లలు తనకు సరిపోరని అంటున్నాడు ఖిల్జీ.
తనకు మరింతమంది పిల్లలు కావాలని, అందుకే నాలుగో భార్యను తెచ్చుకోవాలనే ఉద్దేశంలో ఉన్నానని తెలిపాడు. ఈ మేరకు తనకు తెలిసిన వాళ్లందరికీ పిల్లను చూడమని కోరాడట ఈ 50 ఏళ్ల డాక్టర్.
తన కుటుంబంతో కలిసి ఓ పెద్ద ఇంట్లో ఉంటున్నాడు ఈ వైద్యుడు. మొన్నటివరకు అంతా బాగానే ఉంది కానీ, ప్రస్తుతం కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉందంటున్నాడు. పాకిస్థాన్ లో ఆర్థిక మాంద్యం పీక్ స్టేజ్ లో ఉంది. నిత్యావసరాల ధరలు 3 రెట్లు పెరిగాయి. దీంతో తన కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉందంటున్నాడు.
అయినప్పటికీ పిల్లల్ని కనడం మాత్రం ఆపనంటున్నాడు. మరీ ముఖ్యంగా ఆడపిల్లలంటే తనకు చాలా ఇష్టమని, తనకు ఆడ బిడ్డలు ఎక్కువగా పుడితే ఆనందిస్తానని చెబుతున్నాడు.
ఈ వైద్యుడు, పాక్ ప్రభుత్వాన్ని ఓ చిన్న కోరిక కూడా కోరాడు. తన పిల్లలకు పాకిస్థాన్ మొత్తం తిప్పి చూపించాలనుకుంటున్నాడట ఇతగాడు. అందర్నీ ఒకేసారి తీసుకెళ్లాలంటే చాలా వాహనాలు కావాలి. అందుకే ప్రభుత్వం తనకు ఓ బస్సు ఇప్పించాలని, దేశ పర్యటన పూర్తయిన వెంటనే తిరిగి ఆ బస్సును ప్రభుత్వానికి అప్పగిస్తానని చెబుతున్నాడు.