నెటిజన్ల ఆగ్రహంతో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ప్లిక్స్ తన తప్పు తెలుసుకుని తలొంచింది. ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పింది. నెట్‌ప్లిక్స్‌లోని ఈ సానుకూల ధోరణిని తప్పక స్వాగతించాల్సిందే. అసలేం జరిగిందంటే…
త్వరలో ప్రసాయం చేయనున్న సినిమాకు సంబంధించి పోస్టర్లను నెట్‌ప్లిక్స్ ఇటీవల విడుదల చేసింది. సహజంగానే మార్కెటింగ్‌లో భాగంగానే ఏ సంస్థ అయినా ఆ పని చేస్తుంది. అదే పని నెట్‌ప్లిక్స్ కూడా చేసింది. అయితే సమస్యల్లా నెట్‌ప్లిక్స్ విడుదల చేసిన పోస్టర్లలో శృంగారం శ్రుతిమించి అసభ్యతకు దారి తీసింది. నెట్‌ప్లిక్స్ అసభ్యకర పోస్టర్లు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. సోషల్ మీడియా వేదికగా నెట్‌ప్లిక్స్ ధోరణులను నెటిజన్లు ఎండగట్టారు. మరికొందరైతే…ఏకంగా న్యాయపోరాటం స్టార్ట్ చేశారు.
మొట్ట మొదట ఫ్రెంచ్‌లో మిగ్నొన్నెస్ పేరుతో సినిమా తెరకెక్కించారు. ఇదే అసలు సమస్యకు మూల కారణం. ఈ చిత్రాన్ని ఆంగ్లంలో ‘క్యూటీస్’ పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ ఫిక్స్ అయింది. ఈ సినిమా కథా వస్తువు చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్‌కు చెందిన 11 ఏళ్ల ముస్లిం బాలిక జీవితమే ఈ చిత్రం కథ.
సహజంగా ఏ దేశమైనా ముస్లింల కట్టుబాట్లు ఒకేలా ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే కట్టుబాట్లను ధిక్కరించడమే కథా వస్తువైంది. కుటుంబ కట్టుబాట్లు.. ఆధునిక, ఇంటర్నెట్ కల్చర్ మధ్య నలిగిపోయే ఆ ముస్లిం బాలిక… వాటితో విసిగి పోయి స్వేచ్ఛగా రెక్కలు కట్టుకుని విహరించాలని పరితపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ బాలిక ఓ డాన్స్ గ్రూప్‌లో చేరుతుంది.
ఆ గ్రూప్‌లో 11-15 ఏళ్ల మధ్య వయస్సున్న బాలికలే ఉంటారు. ఈ బాలికల జీవితాన్ని ఆధారంగా తెరకెక్కించిన చిత్రానికి సంబంధించిన పోస్టర్లను నెట్‌ఫ్లిక్స్ ఇటీవల విడుదల చేసింది. ఆ పోస్టర్లు అసభ్యంగా, చిన్నారులను శృంగారానికి ప్రోత్సహించే విధంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడ్డారు. దీంతో తప్పు తెలుసుకున్న నెట్‌ఫ్లిక్స్ ….ఎలాంటి ఇగోలకు, పట్టింపులకు వెళ్లకుండా బహిరంగ క్షమాపణ చెప్పేందుకు ముందుకొచ్చింది.
‘క్యూటీస్.. సినిమా కోసం అనుచితంగా ఉన్న పోస్టర్లను ఉపయోగించినందుకు క్షమాపణ చెబుతున్నాం. ఈ పోస్టర్లు సరిగా లేవు. పోస్టర్లను, సినిమాకి సంబంధించిన వివరణను మారుస్తున్నాం’ అని నెట్‌ఫ్లిక్స్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. నెట్‌ప్లిక్స్ క్షమాపణను నెటిజన్లు స్వాగతించారు. మరోమారు ఇలాంటి అసభ్యతకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.