నా తండ్రిని కూడా రోడ్డుపై….హైకోర్టు జ‌డ్జి ఆవేద‌న‌!

విద్యా వ్య‌వ‌స్థ‌కు సంబంధించి కేసు విచార‌ణ‌లో భాగంగా హైకోర్టు జ‌డ్జి రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఉపాధ్యాయుల‌తో చ‌దువు త‌ప్ప‌, మిగిలిన అన్ని ప‌నులు చేయిస్తున్నార‌ని ఆక్షేపించారు. ఇది స‌రైంది కాద‌ని, ప్ర‌భుత్వం…

విద్యా వ్య‌వ‌స్థ‌కు సంబంధించి కేసు విచార‌ణ‌లో భాగంగా హైకోర్టు జ‌డ్జి రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఉపాధ్యాయుల‌తో చ‌దువు త‌ప్ప‌, మిగిలిన అన్ని ప‌నులు చేయిస్తున్నార‌ని ఆక్షేపించారు. ఇది స‌రైంది కాద‌ని, ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లాల‌ని అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ (ఏజీ) శ్రీ‌రామ్‌కు న్యాయ‌మూర్తి సూచించారు. ఈ సంద‌ర్భంగా గ‌తంలో ఉపాధ్యాయుల‌ను రోడ్ల‌పై నిల‌బెట్ట డాన్ని, వారిలో త‌న తండ్రి కూడా ఉన్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వ‌/  స్థానిక సంస్థ‌ల పాఠ‌శాల‌ల ప్రాంగ‌ణాల్లో గ్రామ స‌చివాల‌యాలు, ఇత‌ర నిర్మాణాలు లేకుండా చూడాల‌ని గ‌త ఏడాది జూన్‌లో ఇచ్చిన ఆదేశాల‌ను అధికారులు అమ‌లు చేయ‌క‌పోవ‌డాన్ని హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్క‌ర‌ణ కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్న విష‌యం తెలిసిందే. దీనిపై జ‌స్టిస్ బ‌ట్టు దేవానంద్ ధ‌ర్మాస‌నం విచార‌ణ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

విద్యా వ్య‌వ‌స్థ మొత్తాన్ని నాశ‌నం చేశార‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు జ‌డ్జి జ‌స్టిస్ బ‌ట్టు దేవానంద్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఉపాధ్యాయుల‌తో చ‌దువు చెప్పించ‌డం త‌ప్ప‌… అన్ని ప‌నులూ చేయిస్తున్నార‌ని, చివ‌ర‌కు మ‌రుగుదొడ్ల‌ను సైతం క‌డిగిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మద్యం దుకాణాల వద్ద కొనుగోలుదారులతో పాటు క్యూలో నిలిచేలా చూసే బాధ్యతను టీచర్లకు అప్పగించారని హైకోర్టు గుర్తు చేసింది. పాఠశాలల మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉన్నాయా? లేవా?, అలాగే  భోజన పథకం పర్యవేక్షణ, ఫొటోలు అప్‌లోడ్‌ చేసే బాధ్యతలను ఉపాధ్యాయుల‌కు అప్ప‌జెప్ప‌డాన్ని ధ‌ర్మాస‌నం తప్పుబట్టింది.

గ్రామ స‌చివాల‌యాల‌ను ఖాళీ చేయించ‌కుండా బాధ్య‌త‌ను ఒక‌రిపై ఒక‌రు నెట్టుకుంటున్నార‌ని పేర్కొన్నారు. పేద విద్యార్థులు చ‌దివే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇలాంటి ప‌రిస్థితి ఉండ‌టం తీవ్ర‌మైన విష‌య‌మ‌న్నారు. గ‌తంలో రోడ్ల‌పై ఎన్ని వాహ‌నాలు వెళ్తున్నాయో లెక్కించేందుకు ఉపాధ్యాయుల‌ను ర‌హ‌దారుల‌పై నిల‌బెట్టార‌ని, వారిలో త‌న తండ్రి కూడా ఉన్నార‌ని జ‌స్టిస్ దేవానంద్ గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం. 

ఎంతో వేద‌న క‌లిగిస్తే త‌ప్ప‌, అవి గుర్తుండే అవ‌కాశం ఉండ‌దు. ఇప్ప‌టికైనా ఉపాధ్యాయుల‌తో చ‌దువు చెప్పిస్తే విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. ప్ర‌భుత్వం ఆ ప‌ని చేస్తుందా లేక మొండిప‌ట్టుద‌ల‌కు పోతుందా? అనేది కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.