అక్కడ బ్రేకింగ్.. ఇక్కడ షాకింగ్..!

మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు తేలిపోతాయి. ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ సాయంత్రం వరకు కొనసాగినా.. మధ్యాహ్నానికల్లా ఓ క్లారిటీ వచ్చేస్తుంది. హుజూరాబాద్ లో కాంగ్రెస్ ని పక్కనపెట్టినా.. బీజేపీ,…

మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు తేలిపోతాయి. ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ సాయంత్రం వరకు కొనసాగినా.. మధ్యాహ్నానికల్లా ఓ క్లారిటీ వచ్చేస్తుంది. హుజూరాబాద్ లో కాంగ్రెస్ ని పక్కనపెట్టినా.. బీజేపీ, టీఆర్ఎస్ లో ఎవరు గెలిచినా అది బ్రేకింగే. 

రెండు పార్టీలు 5 నెలలుగా హోరాహోరీగా చేసిన పోరాటానికి నేడు ఫలితం రాబోతోంది. ఇక ఏపీలో బద్వేల్ బైపోల్ విషయంలో పెద్దగా కొత్త లెక్కలేవీ లేవు. జాతీయ పార్టీ బీజేపీకి డిపాజిట్లు వస్తాయా రావా అనేదే ప్రధాన ప్రశ్న. డిపాజిట్లు కూడా రాకపోతే అది కచ్చితంగా ఆ పార్టీకి షాకింగ్ న్యూసే అవుతుంది. 

బద్వేల్ లో కౌంటింగ్ ఇలా..

పట్టణ శివారులోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. 4  కౌంటింగ్ కేంద్రాల్లో 27 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 12 రౌండ్లుగా కౌంటింగ్ సాగుతుంది. 

బద్వేల్ లో మొత్తం 281 కేంద్రాల్లో ఈనెల 30న పోలింగ్ జరిగింది. 68.37 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. ప్రధాన ప్రతిపక్షం సహా, జనసేన పోటీలో లేకపోవడంతో పోల్ పర్సంటేజీ తగ్గింది. దీంతో సాయంత్రం లోపు ఇక్కడ అధికారిక ఫలితం వెలువడే అవకాశముంది.

హుజూరాబాద్ లెక్కలివీ..

కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఇక్కడ 753 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. ఈ మొత్తం ఓట్లను అధికార పక్షం కొనేసిందనేది ఈటల రాజేందర్ ప్రధాన ఆరోపణ. మరి ఇది ఎంతవరకు నిజమో కాసేపట్లో తేలిపోతుంది. 

2 హాళ్లలో 14 టేబుళ్లలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ 86.64 గా ఉండటంతో.. ఫలితాలు తేల్చడానికి 22 రౌండ్లు లెక్కించాల్సిందే. అయితే మధ్యాహ్నానికే మూడ్ తెలిసిపోతుందని చెబుతున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత అధికారికంగా హుజూరాబాద్ ఫలితం బయటికొస్తుంది.