Advertisement

Advertisement


Home > Politics - Gossip

'దేశా'నికి వృద్దాప్య సమస్య

'దేశా'నికి వృద్దాప్య సమస్య

తెలుగుదేశం పార్టీని గ్రౌండ్ లెవెల్ లో వృద్దాప్య సమస్య పట్టి పీడిస్తోంది. గ్రామాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఓట్లు వేసినా, వేయకున్నా యువత అటు జనసేన ఇటు వైకాపా అన్నట్లుగా చీలిపోయారు. ఇది వాస్తవం. తెలుగుదేశం కేడర్ లో కేవలం యాభై ప్లస్ జనాలే మిగులుతున్నారు. 

గతంలో ఇది నాయకుల స్థాయిలో వుండేది. పార్టీ స్థాపన నుంచి వస్తున్న వారే నాయకులు గా చలామణీ అవుతూ వస్తున్నారు. కానీ వారి వెనుక కేడర్ మాత్రం యువత వుంటూ వచ్చింది. 

కానీ ఇటీవల ట్రెండ్ మారింది. వైకాపా వచ్చిన  తరువాత చాలా మంది అటు షిప్ట్ అయ్యారు. అలాగే జనసేన యాక్టివిటీ పెరిగిన తరువాత మరి కొంత మంది అటు వెళ్లారు. దీంతో నాయకుల మాదిరిగానే వృద్ధులే తెలుగుదేశం పార్టీ కేడర్ లో మిగులుతున్నారు. 

అప్పటికీ చాలా చోట్ల పార్టీ సీనియర్ నేతల తమ్ముళ్లు, కొడుకులు, వారసులను తెరపైకి తెచ్చారు. అలాంటి చోట్ల మాత్రం కొద్దిగా యువత కనిపిస్తోంది. మిగిలిన చోట్ల మాత్రం యువత అన్నది తెలుగుదేశం పార్టీలో కరువైంది. పార్టీ కార్యక్రమాలను బలంగా చేపట్టలేకపోవడానికి ఇది కూడా ఓ కారణమే. పిలుపు ఇస్తే పరుగెత్తుకు వచ్చే యువత లేరు.

అయితే సోషల్ మీడియాలో మాత్రం తెలుగుదేశం పార్టీకి కొంత యువత అండగావుంది. అది కూడా ఎక్కువగా అమెరికాలో, బెంగళూరు, హైదరాబాద్ లో పనిచేసే హై ఫై జనాలు. వీరు సోషల్ మీడియాలో సపోర్ట్ గా వుంటున్నారు తప్ప, గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేసే వారు కాదు.

ఎన్నికలు ఇంకా మరో రెండేళ్ల దూరంలో వున్నాయి. అప్పటికి ఈ వృద్ధాప్య సమస్య ఇంకా ఎక్కువవుతుంది కానీ తగ్గదు. ఇప్పటి నుంచి నియోజక వర్గాల వారీగా పార్టీని యువ నాయకత్వానికి అప్పగించాలి. వారి ద్వారా మళ్లీ యువ కేడర్ ను సమీకరించాలి. కానీ తెలుగుదేశం పార్టీ ఆ ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించడం లేదు. 

పైగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న మరో తప్పిదం ఏమిటంటే లోపాయికారీగా జనసేన ను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. పలు చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల బంధు గణం జనసేనలోకి వెళ్లింది. ఇది పార్టీ అధిష్టానం చేసిన పని కాకపోచవ్చు. పార్టీ నాయకుల ముందు చూపు కావచ్చు. దాని వల్ల కేడర్ చీలిపోయింది. ముఖ్యంగా యంగ్ కేడర్ మిస్ అవుతోంది.

భవిష్యత్ లో పార్టీ టికెట్ లు ఇచ్చే తీరుమీద దృష్టి పెడితే తప్ప ఈ వృద్దాప్య సమస్య తీరదు. ఎప్పటి లాగే అదే యనమల, అదే అయ్యన్న, అదే బుచ్చయ్య చౌదరి, ఇలా వృద్దులకే మళ్లీ టికెట్ లు ఇస్తే కేడర్ కనిపించదు. యువ కేడర్ అంతా జనసేన, వైకాపా వెంట నడుస్తుంది. కేవలం లోకేష్ నో, అక్కడక్కడ యువ వారసులనో ఎంకరేజ్ చేస్తే సరిపోదు. కింది స్థాయిలో యువరక్తాన్ని పార్టీలోకి తీసుకోకుండా తెలుగుదేశం పార్టీకి ఎన్నికల సమయంలో కష్టం అవుతుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?