ఇలా దొరికిపోయావేంటి శివా!

పవన్ పై అభిమానాన్ని చాటితే అతడి ఫ్యాన్స్ నెత్తినపెట్టుకుంటారు. ఏమాత్రం తేడా కొట్టినా బండ బూతులు తిడతారు. ఇదేంటని అడిగితే పవనిజం అంటారు. అయితే పవన్ పై తన అభిమానాన్ని చాటుకున్నప్పటికీ తిట్లు తిన్నాడు…

పవన్ పై అభిమానాన్ని చాటితే అతడి ఫ్యాన్స్ నెత్తినపెట్టుకుంటారు. ఏమాత్రం తేడా కొట్టినా బండ బూతులు తిడతారు. ఇదేంటని అడిగితే పవనిజం అంటారు. అయితే పవన్ పై తన అభిమానాన్ని చాటుకున్నప్పటికీ తిట్లు తిన్నాడు ఓ దర్శకుడు. అతడే శివ నిర్వాణ.

ఈరోజు పొద్దున్నే ఓ వీడియో పెట్టాడు శివ నిర్వాణ. పవన్ కల్యాణ్ నటించిన తమ్ముడు సినిమాలోని ఓ సాంగ్ కు డాన్స్ చేశాడు. తన డిగ్రీ రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. ఏమాటకామాట 'మేడిన్ ఆంధ్రా' పాటకు డాన్స్ కూడా బాగా చేశాడు.

అయితే ఈ దర్శకుడు ఒకటి తలిస్తే, అక్కడ మరోటి జరిగింది. శివ నిర్వాణపై పవన్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. పొద్దున్నే తిట్ల దండకం అందుకున్నారు. దీనికి కారణం ప్రస్తుతం అతడు చేస్తున్న సినిమానే.

విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు శివ నిర్వాణ. ఈ మూవీకి ఖుషి అనే టైటిల్ పెట్టడం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. ఆ టైటిల్ ను మార్చమని ఎప్పట్నుంచో గోల చేస్తున్నారు. ఈమధ్య అది కాస్త చల్లారిందనుకున్న టైమ్ లో, పవన్ పాటకు చిందులేస్తూ వీడియో పెట్టాడు శివ.

దీంతో పవన్ ఫ్యాన్స్ మరోసారి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ముందు టైటిల్ మార్చాలని, తర్వాతే ఇలాంటి వేషాలు వేయాలంటూ కొందరు గట్టిగా తగులుకున్నారు. ఇలాంటి వీడియోలు ఎన్ని పెట్టినా తమ అభిప్రాయం మారదని, నిజంగా పవన్ ఫ్యాన్ అయితే కల్ట్ మూవీ ఖుషి పేరును శివ నిర్వాణ వాడకూడదని మరికొందరు పోస్టులు పెట్టారు.

గంటగంటకు నిరసన సెగ ఎక్కువవ్వడంతో పాపం ఆ వీడియోను డిలీట్ చేశాడు ఈ దర్శకుడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పవన్ ఫ్యాన్స్ కు 'ఖుషి' దర్శకుడు అడ్డంగా దొరికిపోయాడు.