టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎవరి శిష్యుడని ప్రశ్నిస్తే… వెంటనే వచ్చే సమాధానం చంద్రబాబు అని. రేవంత్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌కు సారథ్యం వహిస్తున్నప్పటికీ, ఇంకా ఆయన్ను టీడీపీ నాయకుడిగా, చంద్రబాబు మనిషిగానే చూస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌లో ఆయనకు సీనియర్ల ఆదరణ, సహకారం కరువైంది. ఈ నేపథ్యంలో ఆ మచ్చ నుంచి బయటపడేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.
ఈ క్రమంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆకాశానికి ఎత్తడంతో పాటు చంద్రబాబు ప్రచార ఆర్భాటాన్ని విమర్శించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పనిలో పనిగా ఎల్లో మీడియా వైఎస్సార్‌ను ఏమీ చేయలేకపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లోని బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
“2003లో ప్రపంచానికే చంద్రబాబు రాజు అవుతారనే గొప్ప ఇమేజ్‌తో, అభూతకల్పనలతో ఊహా చిత్రాన్ని ప్రజల ముందు ఆవిష్కరించారు. ఆ రోజు వాళ్ల చేతుల్లో మీడియా వుంది. పేపర్లు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ అసలు పోటీలో లేదని నాడు చిత్రీకరించారు. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో వీరోచిత పోరాటం చేసి అత్యధిక మెజార్టీతో 2004లో ఏ విధంగా అధికారంలోకి తీసుకొచ్చారో …అదే విధంగా నేడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే ఏకైక దిక్కు” అని ఆయన అన్నారు.
తాను పీసీసీ అధ్యక్షుడిగా నియామకం కాగానే, ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేని కలిసి రేవంత్‌రెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే తనకు ఎల్లో మీడియా తెలంగాణలో ఎందుకు మద్దతు ఇస్తున్నదో రేవంత్‌రెడ్డికి తెలియదనుకోవాలా? కేవలం చంద్రబాబు మనిషి కావడం వల్లే ఎల్లో మీడియా ఆయన్ని సొంత నాయకుడిగా భావిస్తూ ప్రచారం ఇస్తోంది. 2009లో కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డి టీడీపీ తరపున పోటీ చేసి సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డిని ఓడించారు. అంతకు రెండేళ్ల ముందు ఎమ్మెల్సీగా రేవంత్‌రెడ్డి ఎన్నికయ్యారు. వైఎస్సార్ అభిమానుల ఆదరణ కోసం రేవంత్‌రెడ్డి రూట్ మార్చినట్టు తాజా కామెంట్స్ చెబుతున్నాయి.