జగన్మోహన్ రెడ్డి సర్కారును ఏదో ఒక తీరుగా బద్నాం చేయడం తప్ప మరొక జీవిత లక్ష్యమే లేనట్టుగా వ్యవహరిస్తున్న పచ్చమీడియా.. ఆ యావలో మంచీ చెడూ ఎంచకుండానే ప్రవర్తిస్తున్నట్టుగా కనిపిస్తోంది. పంచాయతీల దగ్గరినుంచి పట్టణాలు మునిసిపాలిటీలు నగరాలు.. శుభ్రతపరంగా ఏ మాత్రం తీసికట్టుగా కనిపించినా.. వీధులు చెత్తలాగా మారుతోంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ నిందలు వేస్తారు. అదే సమయంలో పరిశుభ్రతను పాటించడానికి, చెత్తను సేకరించడానికి రుసుములు వసూలు చేస్తోంటే.. అక్కడికేదో ప్రభుత్వం ప్రజలను దోచేసుకుంటున్నట్టుగా గగ్గోలు పెడుతోంది.
చెత్త సేకరణ కోసం ప్రజలనుంచి రుసుములు వసూలు చేయడం ఇవాళ కొత్త సంగతేమీ కాదు. చట్టాల రూపంలో ఎప్పటినుంచో ఉన్నదే. అయితే పంచాయతీలు, మునిసిపాలిటీలు పన్ను వసూళ్లను అంత సీరియస్ గా పట్టించుకోకపోవడం జరుగుతుండేది. కానీ పరిశుభ్రతకు, తద్వారా ప్రజారోగ్యానికి పెద్దపీట వేసే ప్రయత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్టోబరు 2021లో చెత్త పన్ను సేకరణను విధిగా మార్చారు. అప్పటినుంచి పన్ను వసూలు గురించి పట్టించుకుంటున్నారు.
ఇళ్లకు, వ్యాపారాలకు, పెద్దపెద్ద వ్యాపార సంస్థలకు విడివిడిగా రేట్లను నిర్ణయించారు. నిజానికి ఊరిని శుభ్రంగా ఉంచుకోవడం అనేది ఊరి ప్రజలందరి బాధ్యత. తాము వేసే చెత్తను ఎవరో తీసుకెళ్లాలని, అది కూడా ఉచితంగా తీసుకెళ్లాలని కోరుకోవడం దుర్మార్గం అవుతుంది. చాలాచోట్ల ప్రభుత్వం విధించిన చెత్త పన్నును ప్రజలు ఇష్టంగానే చెల్లిస్తూ వచ్చారు. అయితే పచ్చ మీడియాకు కళ్లుకుట్టాయి.
చెత్త పన్ను రూపంలో ప్రభుత్వం ప్రజలను దోచేసుకుంటున్నదంటూ.. రకరకాల దుర్మార్గమైన కథనాలు ప్రచురించడం ద్వారా.. ఇచ్చేవారిలో కూడా విముఖతను పెంచే ప్రయత్నం చేశాయి. వ్యాపారాలు చేసుకునే వారికి విధించిన చెత్తపన్నును బకాయిలతో సహా చెల్లించాలని నోటీసులు ఇస్తే దాని మీద మళ్లీ యాగీ చేస్తున్నాయి.
త్రీస్టార్ హోటళ్ల నుంచి నెలకు పదివేల రూపాయల చెత్త పన్ను వసూలు చేస్తున్నారనేది.. పచ్చమీడియా వారి ఆవేదన! ఒకరోజు ఒక గదిని అద్దెకివ్వడానికి 5 నుంచి 10 వేల రూపాయలు దండుకునే ఒక స్టార్ హోటల్.. నెలమొత్తం తాము పారేసే చెత్తం మొత్తం తీసుకెళ్లడానికి మునిసిపాలిటీకి పదివేల రూపాయలు చెల్లించడం కూడా తప్పే అని వాదిస్తోంటే.. సదరు పచ్చమీడియా ఆలోచనలను ఎలా అర్థం చేసుకోవాలి.
స్థానిక సంస్థలు అసలు పన్నులు వసూలు చేయకూడదు, పట్టణాలు నగరాలు అపరిశుభ్రంగా దరిద్రంగా తయారు కావాలి, పెడుతున్న ఖర్చులు తడిసిమోపెడు కాగా ఆదాయం లేక స్థానిక సంస్థలు నిర్వీర్యం అయిపోవాలి.. ఇదంతా కూడా జగన్ వైఫల్యం అంటూ తాము ప్రచారం చేయాలి అన్నట్టుగా వారి పోకడలు సాగుతున్నాయి. ఇంత చెత్తబుద్ధులు, చెత్తవాదనలతో వారు మీడియా పరువు తీస్తున్నారని.. చెత్తపన్ను సబబే అనుకునే ప్రజలు ఈసడించుకుంటున్నారు.