వీర్రాజును నిల‌దీసిన క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌

ఏపీ బీజేపీలో నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్క‌సారిగా బ‌య‌ట ప‌డింది. ఇవాళ ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజుపై మాజీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ నేరుగా ఎటాక్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తెలంగాణ‌లో త‌న…

ఏపీ బీజేపీలో నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్క‌సారిగా బ‌య‌ట ప‌డింది. ఇవాళ ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజుపై మాజీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ నేరుగా ఎటాక్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తెలంగాణ‌లో త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన బండి సంజ‌య్‌కి అండ‌గా ఉంటామంటూనే, ఏపీలో మాత్రం మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు కాపు కాస్తామ‌ని క‌న్నా చెప్ప‌డం విశేషం.

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు వీర్రాజు కూడా కాపు సామాజిక నేతే కావ‌డం గ‌మ‌నార్హం. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న్ను త‌న సామాజిక వ‌ర్గ నేత‌గా క‌న్నా గుర్తించ‌క‌పోవ‌డం చ‌ర్చనీయాంశ‌మైంది. ఇటీవ‌ల క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌తో జ‌న‌సేన ముఖ్య నేత నాదెండ్ల భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. మ‌ర్యాద‌పూర్వ‌క భేటీ అని చెప్పిన‌ప్ప‌టికీ, క‌న్నా తాజా వ్యాఖ్య‌లను గ‌మ‌నిస్తే…ప‌వ‌న్‌తో ట‌చ్‌లో ఉన్నార‌నే విష‌యం బ‌య‌ట‌ప‌డింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ జిల్లా అధ్య‌క్షుల మార్పుపై క‌న్నా తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు.

ఇవాళ క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ కోర్ క‌మిటీలో చ‌ర్చించ‌కుండానే జిల్లా అధ్య‌క్షుల‌ను ఎలా మారుస్తార‌ని వీర్రాజును నిల‌దీశారు. త‌న‌తో మాట మాత్ర‌మైనా జిల్లా అధ్య‌క్షుల మార్పుపై చ‌ర్చించ‌లేద‌ని క‌న్నా అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఇప్పుడు తొల‌గించిన జిల్లా అధ్య‌క్షులంతా తాను నియ‌మించిన వాళ్లుగా చెప్పుకొచ్చారు. తాను రాష్ట్ర అధ్యక్షుడిగా   ఎంతో మందిని బీజేపీలో చేర్పించానన్నారు. ఇప్పుడు వాళ్లంతా ఎందుకు పార్టీ వీడుతున్నారో వీర్రాజు సమాధానం చెప్పాల‌ని క‌న్నా డిమాండ్ చేశారు. అలాగే తన వియ్యంకుడు బీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరాడో సోము వీర్రాజును అడగాల‌ని క‌న్నా సూచించ‌డం విశేషం.

ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్ ,కేసీఆర్ కుట్రలో భాగంగానే ఏపీ నేత‌లు బీఆర్ఎస్‌లోకి వెళుతున్నార‌ని క‌న్నా ఆరోపించారు. ఆంధ్రాలో పవన్, తెలంగాణలో బండి సంజయ్‌ను బ‌ల‌హీన‌ప‌రిచేందుకే ఇద్ద‌రు సీఎంలు క‌ల‌సి కుట్ర చేస్తున్న‌ట్టు ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు. ఒన్ షాట్ టూ బర్డ్స్‌గా కాపు నేతలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింద‌న్నారు. పవన్‌కు తామంతా అండగా ఉంటామ‌ని క‌న్నా స్ప‌ష్టం చేశారు.

సొంత పార్టీ అధ్య‌క్షుడిని విమ‌ర్శించ‌డంతో పాటు జ‌న‌సేనానికి అండ‌గా వుంటామ‌ని క‌న్నా వ్యాఖ్య‌ల వెనుక ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. జ‌న‌సేన‌లో చేరి, టీడీపీతో పొత్తులో భాగంగా ఎలాగైనా ఎమ్మెల్యేగా గెల‌వాల‌నే క‌న్నా ఉద్దేశాన్ని ఆయ‌న తాజా వ్యాఖ్య‌లు ప్ర‌తిబింబిస్తున్నాయ‌ని అంటున్నారు. సోము వీర్రాజుతో పాటు జీవీఎల్‌పై విమ‌ర్శ‌లు చేసిన క‌న్నాపై బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో మ‌రి!