Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఆ జీవోపై ప్రతిపక్షాలు కోర్టుకు?

ఆ జీవోపై ప్రతిపక్షాలు కోర్టుకు?

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జగన్ ప్రభుత్వం కొత్త ఏడాదిలో తెచ్చిన జీవో మీదనే చర్చలు జరుగుతున్నాయి. పార్టీల ర్యాలీలు, సభలను నిషేధిస్తూ ప్రభుత్వం జీవో తెచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రభుత్వం, వైసీపీ తాము తెచ్చిన జీవోను సమర్థిస్తుండగా, విపక్షాలు ఉవ్వెత్తున మండిపడుతున్నాయి. ఎవరి వాదన వారికి ఉంది. ఈ జీవో టీడీపీకి, జనసేనకు తప్పనిసరిగా దెబ్బే. టీడీపీ తరపున నారా లోకేష్ పాదయాత్ర పెట్టుకున్నాడు. జనసేనాని పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర పెట్టుకున్నాడు. ఏ యాత్రలు పెట్టుకోనిది బీజేపీ మాత్రమే. చంద్రబాబు పర్యటనల్లో ప్రాణ నష్టం జరగడం ప్రభుత్వం ఈ జీవో తేవడానికి ప్రధాన కారణం. ప్రాణ నష్టం జరగడానికి కారణం టీడీపీ పార్టీయా, ప్రభుత్వ వైఫల్యమా అనేది వేరే సంగతి.

ఇంతకుముందు ప్రజాసమస్యలపై గళమెత్తితే ప్రభుత్వం దాడులు చేయించిందని, కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిందని ఇప్పుడు ప్రజల మధ్యన ఉండేందుకు ప్రయత్నిస్తుంటే ర్యాలీలు, సభలపై నిషేధం విధించి ప్రతిపక్షాల ఊసు లేకుండా చేయాలన్న కక్షతో జగన్‌ ఉన్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు ఈ జోవోని వ్యతిరేకిస్తూ కోర్టుకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ఎన్నికలకు దాదాపు రెండేళ్ల టైమ్‌ ఉంది. అయితే ప్రతిపక్షాలన్నీ ముందస్తుగానే ఎన్నికల ప్రచారంలోకి దిగడంతో ఏ జిల్లా చూసినా..ఏ సెంటర్‌ చూసినా పార్టీల సభలు, ర్యాలీలు సమావేశాలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయి ప్రజలతోపాటు వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

అందువల్ల ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయం మంచిదేనన్న టాక్‌ వైసీపీ సానుభూతిపరులది. ఏపీలో ఏ విషయం మీదనైనా కోర్టులకు వెళ్లడం సర్వసాధారణమైపోయింది. ఇప్పటివరకు ప్రభుత్వమే వందలసార్లు హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు వెళ్ళింది. ఇక తమకు నష్టం కలిగించే ఈ జీవో మీద ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లకుండా ఎందుకు ఉంటాయి? జగన్‌ సర్కార్‌ నిర్ణయంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఈ కుట్ర పన్నిందని నేతలు ఆరోపించారు. అయితే ఈ వాదనను ప్రభుత్వం ఖండిస్తోంది. ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది.

అంతేకాదు ప్రత్యేక కారణాలతో పోలీస్‌ శాఖ నుంచి అనుమతి తీసుకొని సభలు, ర్యాలీలు చేసుకోవచ్చని కూడా స్పష్టం చేస్తోంది. అయితే విపక్షాలు ఆరోపిస్తున్నట్లు ప్రభుత్వ నిర్ణయం వెనక రాజకీయ కుట్ర ఉందా అన్న దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. త్వరలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్ర ప్రారంభం కానుంది. దీన్ని అడ్డుకోవడానికే జగన్‌ సర్కార్‌ ఈనిర్ణయం తీసుకుందని టిడిపి శ్రేణులు, ఆపార్టీ సానుభూతిపరులు ఆరోపిస్తున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా వారాహి వాహనంలో యాత్రకి సిద్ధమవుతున్నారు. ఎప్పుడూ లేనిది ఈసారి టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ర్యాలీలు, సభలు ప్రాణాలు తీశాయి. గతంలోనూ ఆయన ఎన్నోసార్లు ప్రజల మధ్యకు వచ్చారు. భారీ సభలు, సమావేశాలు పెట్టారు. అయితే ఇంతకుముందు ఇలా జరగలేదు.

ఈసారి మాత్రం ఊహించని విధంగా టీడీపీ నిర్వహించిన సభలు, ర్యాలీలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయన్న అపవాదు వచ్చింది. ఇది నిజంగా బాధాకరమైన విషయమే. కందుకూరు, గుంటూరుల్లో జరిగిన తొక్కిసలాటతో 11మందికి పైగా చనిపోవడంతో రాజకీయ దుమారం మొదలైంది. దాని ఫలితంగానే ఈ జీవో తెచ్చింది. మున్సిపల్, పంచాయితీ రహదారులపై రోడ్డు మార్జిన్ల వద్ద పోలీస్ యాక్ట్ నిబంధన అమలు కాబోతోంది. వాస్తవానికి రాజకీయ నేతలు ఎక్కడ పర్యటించినా రోడ్ మార్జిన్ వద్ద వాహనాన్ని నిలపుదల చేసి ప్రసంగిస్తారు. రేపు లోకేష్ కానీ, పవన్ కల్యాణ్ కానీ చేయబోయే యాత్రలకు ప్రజలు గుమికూడటాన్ని ఒప్పుకోరు. అంతేకాదు కావాలంటే ఎక్కడైనా రోడ్డుకు దూరంగా నిర్వహించుకోవచ్చు.

కానీ నేతలు చేసే యాత్రలన్నీ ప్రధాన రహదారులమీదగా సాగుతాయి. ప్రధాన రహదారిని వదిలి ఊరికి దూరంగా అధికారులు చూపించే స్థలాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకోలేరు. రోడ్ షోలకు ఇది ప్రధాన మైనస్ గా మారుతుంది. బస్సు యాత్ర అయినా రహదారిపై వెళ్లాల్సిందే. అలా కాకుండా అధికారులు చూపించిన స్థలాల్లో యాత్ర ద్వారా వీరు ప్రజలను కలుసుకోవాలంటే రోడ్డు దిగి కొంత దూరం వెళ్లాలి. అంటే షెడ్యూల్ లో మార్పు చేయాల్సి ఉంటుంది. ఇలా టూర్ షెడ్యూల్ మొత్తం అప్ సెట్ అవుతుంది. 

మొదట రూపొందించుకున్న జాబితా ప్రకారం యాత్రను కొనసాగించలేకపోవడమే కాకుండా రూపొందించుకున్న మార్గాల్లో ప్రయాణం చేయలేరు. కొన్ని అరుదైన సందర్భాల్లోనే పోలీసులు అనుమతివ్వాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రతిపక్షాలు పోలీసులు అనుమతివ్వడం కష్టమే. కాబట్టి లోకేష్ 'యువగళం' కానీ, పవన్ కల్యాణ్ బస్సు యాత్రకానీ అనుకున్నరీతిలో సజావుగా సాగడం కష్టమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిపక్షాలు కోర్టుకు వెళితే కోర్టు ఏం చెబుతుందో చూడాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?