సంక్రాంతి తర్వాత భారత్ రాష్ట్ర సమితి కార్యకలాపాలను వేగవంతం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ముఖ్యంగా ఏపీపై ఆయన దృష్టి సారించారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను వ్యూహాత్మకంగా నియమించారు. ప్రధానంగా ఏపీ రాజకీయం కులాల చుట్టూ తిరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ బలహీనతను బలంగా చేసుకునేందుకే కేసీఆర్ ఏపీ అధ్యక్షుడి నియామకాన్ని చేపట్టి… కాపు సామాజిక వర్గానికి సానుకూల సంకేతాలు పంపారు.
ఏపీ బీజేపీకి కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు నేతృత్వం వహిస్తున్నారు. జనసేనాని పవన్‌కల్యాణ్‌ది ఆ సామాజిక వర్గమే. అయితే సోము వీర్రాజు చెప్పుకోతగ్గ నాయకుడు కాకపోవడంతో కాపులు ఆయన్ను తమ ప్రతినిధిగా భావించడం లేదు. పవన్‌కల్యాణ్‌ను మాత్రం తమ సామాజికవర్గం ప్రతినిధిగా వారు భావించడంతో పాటు కొద్దోగొప్పో ఆదరిస్తున్నారు. వారి అండే లేకపోతే ఏపీలో పవన్‌కల్యాణ్ జీరో.
అయితే పవన్‌ను నమ్ముకుంటే పవర్ వస్తుందనే నమ్మకం మాత్రం వారిలో లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే… భవిష్యత్‌లో అధికారంలో పాలు పంచుకోవచ్చనే చిన్న ఆశ కాపు, ఆ సామాజిక వర్గ అనుబంధ కులాల్లో వుంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా జనసేన పాత కాపు అయిన తోట చంద్రశేఖర్‌ను నియమించడంతో ఎక్కడో చిన్న ఆశ. బీఆర్ఎస్ ఏపీలో అడుగు పెట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆంధ్రా సమాజానికి వ్యతిరేకంగా గతంలో కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో బీఆర్ఎస్‌కు కేసీఆర్ వ్యాఖ్యలే అడ్డంకి అవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ తెలిసి కూడా కొంత మంది బీఆర్ఎస్ పంచన చేరడం గమనార్హం. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఏపీలో బలపడాలంటే… ఆ పార్టీ తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కలిగించాలి. ఎటూ ఏపీ కంటే ముందుగానే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారాన్ని దక్కించుకుంటే మాత్రం ఏపీలో చక్రం తిప్పుతుందనడంలో సందేహం లేదు.
ఏపీ రాజకీయ నేతల వ్యాపారాలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. కేసీఆర్ ఏదైనా చేస్తారనే భయంతోనైనా బీఆర్ఎస్ పంచన చేరక తప్పని సరి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. రాజకీయాల్లో వ్యాపార లావాదేవీలు తప్ప, ప్రజాప్రయోజనాల కోసం నాయకులున్నారంటే అది పచ్చి అబద్ధం. తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్‌లో చేరిక వెనుక వ్యాపార ప్రయోజనాలు దాగి వున్నాయని జనసేన నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. దీన్ని కొట్టి పారేయలేం.
ఈ ఏడాది చివరికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ తర్వాత మూడు, నాలుగు నెలలకు ఏపీలో ఎన్నికలుంటాయి. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మాత్రం ఏపీలో మూడునాలుగు నెలల్లో కొద్దోగొప్పో నాయకులను తమ వైపు తిప్పుకునే అవకాశం వుంటుంది. రాజకీయాలన్నీ చేరికలు, తీసివేతల లెక్కలపైన్నే ఆధారపడి వుంటాయి. ఇదే సూత్రం ఏపీలో బీఆర్ఎస్ బలోపేతానికి వర్తిస్తుంది.