తెలుగులో గుడిపూడి జంగాలు అని ఒక సామెత వుంది. గుడిపూడి జంగాలు రాత్రి అయితే ఒక చోట చేరి అది చేద్దాం, ఇది చేద్దాం అని పెద్దపెద్ద ప్రణాళికలు వేసి, తెల్లారేసరికి ఎవరి దారిన వారు పోతారట. నాన్ సీరియస్ గుంపుని ఇలా పిలుస్తారు.
ఆంధ్రాలో బీజేపీ పరిస్థితి కూడా ఇదే. కన్నా లక్ష్మినారాయణకి సోము వీర్రాజు మీద కోపం వచ్చిందట. వస్తే ఏమవుతుంది? ఇద్దరూ కూడా పార్టీకి చేసిందేమీ లేదు. అసలు బీజేపీ అగ్రనాయకులకే పార్టీని బతికించే మూడ్ లేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఆ పార్టీ ఎలాగూ అధికారంలోకి రాదు. సీఎం జగన్ తమ మాటకు ఎదురు చెప్పరు. చంద్రబాబుపై మోదీకి సదభిప్రాయం లేదు. అందితే జుత్తు పట్టుకుంటాడని తెలుసు.
గతంలో వెంకయ్యనాయుడు పార్టీని బతక్కుండా చేసాడని, ఆయన్ని మెల్లిగా తప్పించారు. తర్వాత ఏమైనా బతికిందా అంటే అదీ లేదు. నాయకులంతా టీవీల్లో కనిపించే వాళ్లే కానీ, ఒక్కరు కూడా సొంతంగా గెలవగలిగిన వాళ్లు లేరు. సొంతంగా వెయ్యి ఓట్లు తెచ్చుకోలేని వాళ్లతో పార్టీ బతుకుతుందా?
తాను నియమించిన జిల్లా అధ్యక్షుల్ని సోము వీర్రాజు తొలగించారని కన్నాకు కోపం వచ్చిందట. అసలు వీర్రాజు కానీ, కన్నా కానీ గుక్క తిప్పుకోకుండా పార్టీ జిల్లా అధ్యక్షుల పేర్లు చెప్పగలరా? వాళ్ల సంగతి సరే, జగన్ రాగానే భయం పట్టుకుని సీఎం రమేశ్, సుజనా, వరదాపురం సూరి, ఆదినారాయణరెడ్డి ఇలా చాలా మంది టీడీపీ వాళ్లు బీజేపీలో చేరారు కదా! వాళ్లెప్పుడైనా పార్టీ కోసం పని చేసారా? చేయమని అడిగే ధైర్యం కన్నాకి కానీ, వీర్రాజుకు కానీ వుందా?
బీజేపీ నుంచి కన్నా జనసేనలోకి వెళ్తాడని ప్రచారం. ఇదో జోక్. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుంటే వివేరా అనే హోటల్ నార్కెట్‌పల్లి దగ్గర వస్తుంది. జనం సౌకర్యార్థం ఈ హోటల్‌ని కుడి, ఎడమ రెండు వైపులా ఏర్పాటు చేసారు. యూటర్న్ శ్రమ లేకుండా ఇలా చేయడం చాలా అరుదు.
బీజేపీ, జనసేన కూడా రోడ్డుకి అటూఇటూ వున్న ఒకే శిబిరం. దాంట్లోంచి దీంట్లోకి వెళ్లినా అవే వంటకాలు. కాకపోతే బీజేపీలో చాలా మంది నాయకులు వుంటారు. ఏ పనీ చేయరు. మోదీని పొగుడుతూ ఎప్పుడైనా వ్యాసాలు రాస్తారు. జనసేన సింగిల్ లీడర్ పార్టీ. అనవసరంగా చిరంజీవి పూనకాలు లోడింగ్ అని పాట పెట్టుకున్నాడు కానీ, ఎప్పటి నుంచో ఆ లోడింగ్ పవన్‌కే. ఒకసారి లోడు చేసుకుని, ఏదో ఒక మీటింగ్ పెట్టి వదిలించుకోకపోతే పవన్‌కి హాంగోవర్ వచ్చేస్తుంది. కాకపోతే పూనకానికి కూడా తన, పర వుంటుంది. 11 మంది చచ్చిపోతే నోరు మెదపడు. అదే ఖర్మ కాలి జగన్ సభలో ఇద్దరు చనిపోయి వుంటే వెంటనే సభ పెట్టి పరిహారం ఇచ్చేసి, వైసీపీ వాళ్ల తాట తీస్తానని హెచ్చరించేవాడు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అనే వాహనానికి స్టీరింగ్ ఢిల్లీలో వుంది. అప్పుడప్పుడు యాక్సిలేటర్, బ్రేకులు నొక్కుతూ కన్నా, వీర్రాజు సంబరపడుతుంటారు. పవన్ వాహనానికి స్టీరింగ్, బ్రేకులు రెండూ లేవు. వున్నది యాక్సిలేటర్. త్వరలో అది టీడీపీని గుద్దబోతుంది. కోపాలు అలకలు మాని అర్జెంట్‌గా ఒక ఆక్సిజన్ సిలిండర్ తెచ్చి పార్టీ ముక్కులో పెట్టండి. కనీసం కోమాలో అయినా కొన్నాళ్లు బతుకుతుంది.