తెలుగు రాజకీయాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఓ కమెడియన్ అనే భావన వుంది. అందుకు తగ్గట్టుగానే పాల్ వ్యవహార శైలి వుంటోంది. ప్రత్యర్థులను అవహేళన చేయడానికి కేఏ పాల్, ఆయన పార్టీని పోల్చడం గత కొంత కాలంగా పరిపాటైంది. అలాంటి కేఏ పాల్ బెటర్ అని ప్రశంసించేలా మంచి పని చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతుతోంది. ఇటీవల చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.
ఈ దుర్ఘటనలను కూడా తమకు అనుకూలంగా మలుచుకునే నీచస్థాయిలో రాజకీయాలు చేయడం చూస్తున్నాం. ఇందుకు వామపక్ష పార్టీలు కూడా అతీతం కాదు. ఈ నేపథ్యంలో కేఏ పాల్ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ప్రజాప్రయోజనాల రీత్యా ఆయన పిటిషన్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇటీవల కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్‌షోలో తొక్కిసలాట కారణంగా 8 మంది చనిపోయారని, ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు.
దుర్ఘటనల నేపథ్యంలో రోడ్లపై బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతున్నా… వాటిపై దృష్టి పెట్టకుండా, స్వేచ్ఛ పేరుతో రోడ్‌షోలు, సభలకు అనుమతి ఇవ్వాల్సిందే అని టీడీపీకి వంత పాడేలా వామపక్షాలతో సహా కొన్ని ప్రజాసంఘాలు డిమాండ్లు చేయడం గమనార్హం.
ఇలాంటి తరుణంలో ప్రజల ప్రాణ పరిరక్షణ కోణంలో కేఏ పాల్ పిటిషన్ వేయడం గమనార్హం. ఈ పిటిషన్‌పై హైకోర్టు నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. మిగిలిన విషయాల్లో ఎలా వున్నా… టీడీపీ, జనసేన, వామపక్షాల నేతల కంటే కేఏ పాల్ బెటర్ అనే ప్రశంస కొన్ని వర్గాల నుంచి వ్యక్తం కావడం విశేషం.