కేంద్రంలో ఏకఛత్రాధిపత్యంగా పాలన సాగిస్తోన్న బీజేపీకి రెండు తెలుగు రాష్ట్రాలు కొరకరాని కొయ్యలుగా తయారయ్యాయి. ఎలాగైనా దక్షిణాదిని కూడా తమ హస్తగతం చేసుకోవాలనుకుంటున్న కమలదళం వ్యూహాలు పన్నుతోంది. అందులో భాగంగానే కర్నాటకలో అధికారం చేజిక్కింది, తమిళనాడులో అన్నాడీఎంకే విచ్ఛిన్నంతో పరిస్థితులు తమకు అనూకూలంగా మార్చుకోవాలనుకుంటోంది. రాగాపోగా ఏపీ, తెలంగాణలో పరిస్థితులు ఏమాత్రం ఆ పార్టీకి అనుకూలంగా లేవు.
రెండు చోట్లా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఏపీలో ముందు ప్రతిపక్ష పాత్రలోకి, ఆ తర్వాత అధికారపక్షంలోకి వెళ్లిపోతామంటూ బీరాలు పలికినా అది సాధ్యమయ్యే పనికాదని వారికీ తెలుసు. ఇక తెలంగాణలో కూడా బీజేపీది సింగిల్ సీట్ వ్యవహారం. అయితే కేసీఆర్ కి పోటీగా మాత్రం అక్కడ బీజేపీ గొంతులు గట్టిగానే వినిపిస్తుంటాయి. కేసీఆర్ ని తీవ్రంగా విమర్శించి రాజకీయ లాభం పొందాలనేది బీజేపీ ఉపాయం. కాంగ్రెస్ ని వెనక్కు నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని చూస్తోంది బీజేపీ.
ఇలాంటి సందర్భంలో బీజేపీకి అనుకోని పంచాయితీ ఒకటి ఎదురైంది. పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు ఏపీ-తెలంగాణ జల జగడంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించబోతోంది. ఈనెల 25న జరగబోతున్న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ దీనికి వేదిక కానుంది. అయితే ఇప్పటికే కేంద్రం ఈ జలవివాదంలో తన తీర్పు ఏంటో చూచాయగా చెప్పేసింది. తెలంగాణకు అనుకూలంగా, ఏపీకి వ్యతిరేకంగా తీర్పు రాబోతున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో జగన్ చేపట్టబోతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్డుకట్ట వేయాలనేది బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. ఈ పనిచేస్తే తెలంగాణలో కేసీఆర్ అసమర్థతను ఎండగట్టడంతో పాటు, తెలంగాణ నష్టపోకుండా చేసిందన్న పేరు కూడా బీజేపీ ఖాతాలోకి వస్తుందనేది ఆ పార్టీ ప్లాన్. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి కేసీఆర్, జగన్ తో కుమ్మక్కయ్యారని… బీజేపీ దాన్ని బయటపెట్టి, తెలంగాణ హక్కుల్ని కాపాడిందని చెప్పే ప్రయత్నమే ఇది.
ఇటీవల రాయలసీమ కొత్త పథకం కాదంటూ ఎన్జీటీ కమిటీ ఇచ్చిన ఆదేశాలను స్క్రూటినీ చేయిస్తూ, ఆ ఆదేశాలు రివర్స్ చేయించేందుకు ప్రయత్నిస్తోంది కేంద్రం. ఇదే జరిగితే ఏపీలో బీజేపీకి కొత్తగా జరిగే నష్టమేమీ లేదు, అటు తెలంగాణలో మాత్రం ఆ పార్టీ నేతల ఇమేజ్ పెరుగుతుంది. అందుకే కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తూ తెలంగాణ కోసం ఏపీని బలిచేయాలనే కుటిల యత్నాలు చేస్తోంది.