ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్యన తలెత్తుతున్న నీటి తగాదాలను కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదిలిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయిప్పుడు. పిట్టపోరూ పిట్టపోరూ పిల్లి తీర్చినట్టుగా.. ఇరు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టి, నీటి పారుదల పథకాల నిర్మాణం ప్రయత్నాలనే ఆపేంచేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని భోగట్టా! తెలంగాణలో బలోపేతం కావడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఢిల్లీకి ఈ పంచాయతీని తీసుకుబోతున్నారనే టాక్ మొదలైంది.
సముద్రంలోకి భారీగా తరలిపోయే కృష్ణా వరద నీటిని రాయలసీమ అవసరాల కోసం వాడుకోవాలన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పంపై తెలంగాణ అభ్యంతరాలు చెబుతుండటం, ఇదే సమయంలో తెలంగాణ ప్రాజెక్టులు.. ఈ వ్యవహారాన్ని తనకు అడ్వాంటేజ్ గా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రాజెక్టులపై స్టేటస్ కో పెట్టేసి.. అటు జగన్ కు, ఇటు కేసీఆర్ కు చెక్ పెట్టే రాజకీయ వ్యూహాన్ని బీజేపీ ఫాలో అవుతుండవచ్చు. అయితే అదే జరిగితే.. అది జగన్ కో, కేసీఆర్ కో నష్టం కాదు. అటు రాయలసీమ ప్రజలకూ, ఇటు తెలంగాణ ప్రజలకు నష్టం కలుగుతుంది!
కృష్ణ నుంచి భారీగా వరద నీరు సముద్రంలోకి కలిసి పోతుంది. అవకాశం ఉన్నా ఆ నీటిని వాడుకులేని పరిస్థితుల్లో ఆ ప్రాంతాలు నిరాశలో మిగిలిపోవాల్సి వస్తుంది. అదే ఇక్కడ అసలైన బాధాకరమైన అంశం.
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించేసి తెలంగాణలో బలోపేతం కావాలనే ప్రయత్నంలో బీజేపీ ఉండవచ్చు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రం ఈ రకంగా స్పందిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ పథకాన్ని ఆపాలని బీజేపీ గట్టిపట్టుదలతోనే ఉన్నట్టుగా ఢిల్లీ నుంచి టాక్ వినిపిస్తోంది.
గత ఏడాది కృష్ణ నుంచి సముద్రంలోకి తరలిన నీటి పరిమాణం 600 టీఎంసీలు. గత నాలుగేళ్ళు 67.44, 91.70,115.40, 179.30 టిఎంసిల చొప్పున లభించాయి. గత ఏడాది రాయలసీమకు గరిష్ట స్థాయి నీటి లభ్యత నమోదైంది. అయినా సముద్రం పాలైన నీరు 600 టీఎంసీలు!
ఈ సారి కూడా అప్పుడే నీరు సముద్రాన్ని తాకింది. కానీ రాయలసీమ వైపుకు వెళ్లడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు అందించడానికి ఎత్తు సమస్య ఉంది. దీన్ని పరిష్కరించుకుని వరద నీటిని ఉపయోగించుకోవాలనుకుంటే సీమకు ఎత్తిపోతల పథకమే శరణ్యం.
మరోవైపు పోలవరం పథకం పూర్తి అయితే.. ఆ తర్వాత కృష్ణ నీటిని అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఏపీ భారీగా వినియోగించుకోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో ఎలా చూసినా.. రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది బ్రహ్మాండమైన ఆలోచన అవుతుంది.
శ్రీశైలం ప్రాజెక్టు మీద ఆధారపడిన ఇతర సాగునీటి పథకాలన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తే వాటి ప్రయోజనాలను పొందేంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రైతులే.
దక్షిణ తెలంగాణలో సాగునీరు అందించేందుకు చేపట్టిన పథకాలను పూర్తిచేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతోపాటు కృష్ణా నీటిని గరిష్టంగా వాడుకోవడం తెలంగాణకు సాధ్యమవుతుంది. అదే విధంగా ఏపిలోని రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందించడానికి వరద, మిగులు, నికర జలాల కేటాయింపు ఉన్నాయి. అందుకు సంబంధించి కొన్ని పథకాలు పూర్తయి మరికొన్ని పథకాలు నిర్మాణంలో ఉన్నప్పటికి కేటాయించిన నీటిని ఏపి వినియోగించుకోలేకపోతోంది.
ఈ పరిస్థితుల్లో నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకొని వృధాను అరికట్టేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపి ప్రభుత్వం చేపట్టింది. ఇది కొత్త పథకం కాదని ఎన్జీటి ఆదేశాల మేరకు ఏర్పడిని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటి తేల్చిచెప్పింది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు లేనేలేదు. అందువల్ల ఈ ప్రాజెక్ట్ను కొత్త ప్రాజెక్ట్గా పరిగణించాల్సిన అవసరం లేదు. కేటాయించిన నీటిని ఉపయోగించుకునేందుకు మాత్రమే వీలవుతుంది.
ఏపిలోని రాజకీయ పార్టీలు దీనిపై మాట్లాడడం లేదు. తేలుకుట్టిన దొంగల్లా తెలుగుదేశం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. దీనిపై మాట్లాడితే ప్రాంతాల ప్రకారం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ పార్టీలు నోరుమెదపడం లేదు. ఇక ఎల్లో మీడియా కూడా అదే ధోరణిలో వ్యవహరిస్తోంది. అందువల్ల ఏపిలో దీనిపై చర్చేలేదు. ఇక ఏపీ ప్రభుత్వం కూడా స్పందించాల్సిన సమయం వచ్చింది.
ప్రాజెక్ట్ కొత్తది కాదని, కేటాయించిన నీటినే వినియోగించుకుంటున్నామని రెండు రాష్ట్రాల ప్రజలకు అర్థమయ్యేరీతిలో వివరించడానికి అంత ఆసక్తి చూపడం లేదు. దాంతో ఏపి ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని తెలంగాణ ప్రాంత ప్రజల్లో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతంలో అభిప్రాయం బలంగా ఉంది. ఇక్కడ ఏపి ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడానికి తెలంగాణలోని పార్టీలు శతథా ప్రయత్నిస్తున్నాయి. ఆ పార్టీలు కేసులు వేశాయి. ఎన్జీటిలో కేసు వేసినప్పటికీ టెండర్ ప్రక్రియ నిర్వహించుకునేందుకు అనుమతి లభించింది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. ఇవన్నీ విచారణ జరగాల్సి ఉంది. ఈలోగా ఎన్జీటి ఆదేశాల మేరకు ఏపి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్ ప్రక్రియను ముగించింది. ఈ లోగా బిజెపి నాయకులు తెలంగాణలో మాట్లాడుతున్న విధంగానే కేంద్రం ప్రభుత్వం రంగంలోకి దిగింది. రెండు రాష్ట్రాల్లోనూ బిజెపి నాయకులు అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్నారు.
బిజెపి నాయకులు చేసిన ఫిర్యాదులకు అనుకూలంగా కేంద్ర మంత్రిత్వ శాఖలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. కేంద్రంలోని బిజెపి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వన్ నేషన్ విధానాన్ని అన్ని విభాగాల్లోనూ అమలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పుడు నీటి పారుదల రంగంలో కూడా అదే ప్రయోగం చేస్తోంది. రాష్ట్రాల మధ్య ముఖ్యంగా తెలంగాణ, ఏపి మధ్య వివాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోందని ఇంజనీరింగ్ నిపుణులు సైతం అభిప్రాయ పడుతున్నారు.
అన్ని అధికారాలనూ తన గుప్పిట్లోనే పెట్టుకుంటూ.. అంతటా తామే ఉండాలని బీజేపీ అనుకుంటే అనుకోవచ్చు. అయితే ఈ రాజకీయం వల్ల నష్టపోతున్నది మాత్రం అంతిమంగా కరువు ప్రాంతాల్లోని ప్రజలు కావడం విచారకరం.