సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం ఆపాలని సింగర్ మాళవిక విజ్ఞప్తి చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న నెటిజన్లపై సైబర్ క్రైం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే…
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి విషమ పరిస్థితుల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన చెన్నై ఎంజీఎం హెల్త్ కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్‌పై ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అలాగే తన తండ్రి ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడలేదని, అందువల్లే అప్‌డేట్స్ ఇవ్వడం లేదని, ఆయన త్వరగా కోలుకుని రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేయాలని బాబు తనయుడు చరణ్ భావోద్వేగ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కరోనా రావడానికి ప్రధాన కారణం సింగర్ మాళవికే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జూలై నెలాఖరులో హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి బాలు వెళ్లారని, అదే సమయంలో తనకు కరోనా పాజిటివ్ అని తెలిసినా మాళవిక కూడా పాల్గొందని సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. మాళవిక వల్లే బాలు కరోనాకు గురయ్యారనే సోషల్ మీడియా ప్రచారంపై మాళవిక ఫైర్ అవుతున్నారు.
తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టాలంటూ ఆమె హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీ బాలు కరోనా బారిన పడడానికి తానెంత మాత్రం కారణం కాదని ఆమె చెబుతున్నారు. కావున తనపై దుష్ప్రచారం ఆపాలని ఆమె వేడుకుంటున్నారు.