పుష్ప సినిమాలో తన పాత్రకు జాతీయ అవార్డు దక్కడం పట్ల అమితానందాన్ని వ్యక్తం చేశాడు నటుడు అల్లు అర్జున్. ప్రేక్షకులు కోరుకున్నది ఇచ్చాం కాబట్టే పుష్ప విజయం సాధించడంతో పాటు తనకు అవార్డు కూడా దక్కిందనే ఆనందాన్ని అల్లు అర్జున్ వ్యక్తం చేశాడు.
మరి పుష్ప తర్వాత ఏమిటనే ప్రశ్నలకు కూడా అల్లు అర్జున్ సమాధానం ఇచ్చాడు. ప్రత్యేకించి పుష్ప 2 అన్ని అంచనాలనూ అందుకునే విధంగా ఉంటుందని ఊరించాడు. పుష్పతో తెలుగు రాష్ట్రాల అవతల మంచి గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ కు హాలీవుడ్ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్నకు కూడా ఆ హీరో ఆసక్తిదాయకమైన సమాధానమే చెప్పాడు.
ప్రస్తుతం భారతదేశం గ్లోబల్ సూపర్ పవర్ గా ఎదుగుతోందని అల్లు అర్జున్ విశ్లేషించాడు. అన్ని రంగాల్లోనూ, అన్ని రకాల వ్యాపారాల్లోనూ భారత్ అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతోందని, సినిమా రంగం కూడా ఈ విషయాన్ని గుర్తించాలని అల్లు అర్జున్ అన్నాడు. అన్ని రంగాల్లోనూ గ్లోబల్ సూపర్ పవర్ గా ఇండియా ఎదుగుతున్న రీతిలోనే.. సినిమా రంగంలో కూడా అంతర్జాతీయ స్థాయిని అందుకుంటోందని అన్నాడు.
మరో పది సంవత్సరాల్లో భారతీయ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా పూర్తి వీక్షకాదరణ పొందుతాయని అల్లు అర్జున్ అంచనా వేశాడు. ప్రస్తుతం కొరియన్ డ్రామాలను మారుమూల భారతదేశంలో వీక్షిస్తున్నట్టుగా.. బారతీయ సినిమాలను కూడా ప్రపంచమంతా చూసే సమయం మరెంతో దూరంలో లేదన్నాడు. అంతర్జాతీయంగా మార్కెట్ ను పెంపొందించడంపై మూవీ మేకర్లు దృష్టి సారించాలన్నాడు పుష్ప హీరో!