రీమేక్ సినిమాలు చేయడం మీద ఇప్పటికే మెగా బ్రదర్స్ విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఓటీటీ యుగంలో కూడా ఆల్రెడీ విడుదలైపోయిన తెలుగులో డబ్ అయిపోయి మరీ విడుదలైన లూసీఫర్ వంటి సినిమాలను రీమేక్ చేయడం, ఎందుకు ఆడాయో తెలియని వేదాళం వంటి సినిమాలను రీమేక్ చేయడం చిరంజీవిపై విమర్శలకు కారణం అయ్యింది. మరి ఇలా రీమేక్ టేస్టులతో ఎదురుదెబ్బలను తిన్న చిరంజీవి.. తన వద్దకు వచ్చిన ఒరిజినల్ స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకోవడంలో ఫెయిలయిన విషయాన్ని ఆయన సన్నిహితులే బయటపెడుతున్నారు!
నిర్మాత అశ్వినీదత్ తో చిరంజీవి సాన్నిహిత్యం గురించి వేరే చెప్పనక్కర్లేదు. మరి అలాంటి అశ్వినీదత్ చిరంజీవి కోసం ఒక మంచి స్క్రిప్ట్ రాయించి తీసుకెళ్లాడట. అది మరేదో కాదు.. ఫ్యామిలీ మ్యాన్ సీరిస్ గా రూపొంది, ప్రేక్షకులను కనురెప్ప కొట్టించకుండా వీక్షకాదరణ పొందిన స్క్రిప్టే!
రాజ్ డీకే దర్శకత్వంలో మనోజ్ బాజ్ పేయి హీరోగా రూపొందిన ఫ్యామిలీ మ్యాన్ ఫస్ట్ పార్ట్ ఇండియాలో వెబ్ సీరిస్ లకే ఆదరణను పెంచింది. అమెజాన్ లో విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ ఇప్పటికీ కొన్ని భాగాలను మళ్లీ మళ్లీ చూడాలనే ఆసక్తిని రేపుతూ వీక్షకాదరణ పొందుతూ ఉంది.
అది పెద్ద వెబ్ సీరిస్ అయినా.. ఒక మంచి సినిమాకు ఉండాల్సిన ముడి సరకు ఉంది. లెంగ్తీ సీరిస్ గానే ఆకట్టుకున్న ఫ్యామిలీమ్యాన్ ను కనీసం మూడు గంటల సినిమాగా కుదిస్తే.. అలాంటి సినిమాలో హీరో ఎవరైనా.. అదిరిపోయేది! మరి అలాంటి స్క్రిప్ట్ చిరంజీవి వద్దకు వెళ్లిందట. అయితే దాన్ని ఆయన తిరస్కరించారట.
ఎందుకు అంటే.. తన పాత్రకు పిల్లలు ఉన్నారంటే చిరంజీవికి అలాంటి ఎలిమెంట్స్ నచ్చలేదట! ఆఖరుకు ఆ పిల్లల పాత్రలను తీసేద్దామని కూడా చెప్పారట! అయినా చిరంజీవికి నచ్చలేదట! మరి రీమేక్ సినిమాల మీద మోజు పడ్డ చిరు ఫ్యామిలీమ్యాన్ వంటి స్టోరీని మిస్ అయ్యి, పాన్ ఇండియా లెవల్ సినిమాను మిస్ అయ్యాడనడంతో ఎలాంటి ఆశ్చర్యం లేదు!