కేసీఆర్ జాతీయ పార్టీని వీళ్ళు ముందుకు తీసుకుపోగలరా?

జాతీయ పార్టీ పెట్టిన కేసీఆర్ తన తొలి అడుగు ఏపీలో వేశారు. అక్కడ బీఆర్ఎస్ శాఖను లాంఛనంగా ప్రారంభించారు. సంక్రాంతి తరువాత పార్టీ కార్యకలాపాలు అంటే పార్టీని విస్తరింపచేయడం వేగం పుంజుకుంటుందన్నారు. నిన్న పార్టీలో…

జాతీయ పార్టీ పెట్టిన కేసీఆర్ తన తొలి అడుగు ఏపీలో వేశారు. అక్కడ బీఆర్ఎస్ శాఖను లాంఛనంగా ప్రారంభించారు. సంక్రాంతి తరువాత పార్టీ కార్యకలాపాలు అంటే పార్టీని విస్తరింపచేయడం వేగం పుంజుకుంటుందన్నారు. నిన్న పార్టీలో ఏపీ నాయకుల చేరిక సందర్భంగా చాలాసేపు మాట్లాడిన కేసీఆర్ దేశాన్ని అభివృద్ధి చేయడం గురించి అనేక విషయాలు చెప్పారు. కొన్ని నీతులు, విలువలు కూడా చెప్పారు. ఆయన ఇప్పుడు జాతీయ నాయకుడు కాబట్టి ఆ మాత్రం చెబితేనే బాగుంటుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని, దళిత బంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్ తయారవుతుందని, దేశం మొత్తం రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం అసాధ్యమేమీ కాదని కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. దేశం మొత్తం రైతులకు 1.45 లక్షల కోట్లతో ఉచిత విద్యుత్తు ఇవ్వొచ్చని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలను ఆకట్టుకోవడం కోసం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేస్తామని, మోడీకి ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నామంటూ కేసీఆర్ వెల్లడించారు. మొత్తానికి సీఎం కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్ పేరుతో, దళిత బంధు పేరుతో దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

రైతులకు ఉచిత విద్యుత్ పేరుతో దేశ వ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తూనే, ఎస్సీ ఓటు బ్యాంకును టార్గెట్ చేస్తూ దళిత బంధు పథకాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. బిజెపిని ఓడించడమే తమ లక్ష్యమని చెప్పుకునే కేసీఆర్, దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తామని అందుకు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులను, దళితులను మొదట ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఇక పార్టీ ఏపీ అధ్యక్షుడిగా జనసేన మాజీ నేత తోట చంద్రశేఖర్ ను నియమించారు. అంటే ఆ రాష్ట్రంలో పార్టీని నడిపించే బాధ్యత ఆయనదే. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి అన్న సంగతి తెలిసిందే కదా.

కానీ రాజకీయ నాయకుడిగా ఫెయిల్ అయ్యారు. మహారాష్ట్ర కేడర్ లో సుదీర్ఘ కాలం పనిచేసిన ఈ ఐఏఎస్ అధికారి పదవీ విరమణ తరువాత తన గాలి రాజకీయాల వైపు సోకింది. కాపు నేత కావడంతో పీఆర్పీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. గుంటూరు ఎంపీగా 2009లో హేమాహేమీలతో తలపడ్డారు. కానీ ఓటమే ఎదురైంది. అటు తరువాత వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో కర్చిఫ్ వేశారు. 2014లొ నరసాపురం నుంచి పోటీచేసి చేతులు కాల్చుకున్నారు. అయితే చేతిలో మీడియా ఉంటే గుర్తింపు ఉంటుందన్న భావనతో 99 టీవీ చానల్ ను ఏర్పాటుచేశారు. 2019 ఎన్నికల్లో పవన్ చెంతకు చేరారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు కేసీఆర్ ఆఫర్ తో బీఆర్ఎస్ లో చేరారు.

ఇలాంటి వాడు పార్టీని నడిపించగలడా? మరి కేసీఆర్ ఆయనలో ఏం చూశారో తెలియదు. ఇక టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన దళిత నాయకుడు రావెల కిషోర్ బాబును (ఈయనా మాజీ ఉన్నతాధికారే) జాతీయ వ్యవహారాల ఇంఛార్జిగా పెట్టారు. నిజానికి రాజకీయంగా వీళ్లిద్దరికీ పెద్ద సీన్ లేదు. జాతీయ పార్టీ అనే ఆశతో వాళ్ళు చేరారేమో. వాళ్ళు వస్తామనగానే కేసీఆర్ అదే మహా ప్రసాదమని చేర్చుకున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఏవిధంగా నడవబోతున్నాడో వీళ్ళనుబట్టి చూస్తేనే తెలిసిపోతోంది. నేతల వరకూ చేర్చుకోవడం ఓకే. ఆ మధ్యన రాష్ట్రంలో కుల సంఘాల నాయకులుగా చలామణి అవుతున్న ఒక నలుగురైదుగురు నాయకులను ప్రగతి భవన్ కు ఆహ్వానించారు. గంటల తరబడి సమయమిచ్చారు. వారితోనేకలిసి భోజనం చేశారు. దీంతో వారు తెగ ఉబ్బిబ్బయ్యారు.

తెలంగాణ సాధనకు తనతో కలిసి పనిచేసిన వారికి కేసీఆర్ సమయమివ్వరు. కనీసం కలిసేందుకు చాన్సివ్వరు. అటువంటిది తమను పిలిచి భోజనం పెట్టేసరికి తమకింత గౌరవమా? అని వారు తెగ సంబరపడిపోయారు. అయితే వారు ఏపీ సమాజంలో కనిపించింది చాలా తక్కువ. అసలు వారు పేర్లు కూడా పెద్దగా ప్రాచుర్యంలో లేవు. అటువంటి నాయకులను కేసీఆర్ భూతద్ధంలో పెట్టి చూపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబును నమ్ముకుంటే కుక్కతోకను పట్టుకొని గోదారిని ఇదినట్టే అవుతుందన్న టాక్ ఏపీ సమాజంలో వినిపిస్తోంది.

అయితే ఇప్పటికిప్పుడు కేసీఆర్ గాలానికి నేతలు చిక్కకు పోయేసరికి దారిన పోయే దానయ్యలను పట్టుకొని ఏపీని ప్రభావితం చేసే నాయకులుగా చూపేందుకు కేసీఆర్ ఆరాటపడుతుండడాన్ని చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పుడు తోటను, రావెలను చూసి టీడీపీ, వైసీపీ, జనసేన నేతలు క్యూకడతారని కేసీఆర్ నమ్ముతున్నారో.. భావిస్తున్నారో.. లేక వ్యూహాత్మకంగా మాట్లాడేస్తున్నారో తెలియదు కానీ.. నేరుగా సిట్టింగులు వచ్చి పార్టీలో జాయినవుతారని సెలవిస్తున్నారు. సంక్రాంతి తరువాత పార్టీలో ఫుల్ డిమాండ్ ఉంటుందట.

పార్టీ కార్యాలయం రద్దీగా మారుతుందట. మొన్నటికి మొన్న తాను ఢిల్లీ లో ప్రారంభించిన కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికే రానివారు ఇప్పుడు సంక్రాంతి తరువాత ఏపీ కార్యాలయానికి వస్తారని ప్రకటించడం కాస్తా అతే. వాస్తవానికి ఏపీలో రాజకీయాలు నడిపిన యోధానుయోధులు పరిస్థితులు కలిసి రాక ఖాళీగా ఉన్నారు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. వారిని సంప్రదిస్తే ఆలోచించి చెబుతామని చెప్పారు దీంతో రాజకీయంగా కుదురుకోలేని తోట చంద్రశేఖర్, రావెల కిశోర్ బాబును రప్పించి.. బాధ్యతలు అప్పగించి.. ఏపీ పాలిటిక్స్ లో చక్రం తిప్పుతానని చూస్తున్న కేసీఆర్ ప్రయత్నాలు వర్కవుట్ అవుతాయా?