తెలంగాణా రాజకీయ నాయకురాలైపోయిన వైఎస్ షర్మిలకు అధికారం చేపట్టాలనే కోరిక ఉంది. పరిపాలన చేయాలనే కాంక్ష ఉంది. ఒక గొప్ప నాయకురాలిగా ఎదగాలనే ఖాయిష్ ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన ఎవరికైనా ఇది సహజం. అందుకోసం ప్రయత్నాలు చేస్తున్న షర్మిల ప్రజలకు దగ్గర కావడం కోసం పాదయాత్ర చేస్తోంది. షర్మిల పాదయాత్ర చేయడం ఇది రెండోసారి.
మొదటిసారి అన్న జగన్ జైలుకు వెళ్ళినప్పుడు పాదయాత్రచేసి వైఎస్సార్ సీపీ ఉనికిని కాపాడింది. ఆరోజు ఆమె పాదయాత్ర చేసి పార్టీని కాపాడిన కారణంగానే జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పొచ్చు. అప్పట్లో ఆమె చేసిన పాదయాత్ర రికార్డ్ బ్రేక్ అని చెప్పొచ్చు. ఇప్పుడు తన రాజకీయ మనుగడ కోసం, తన పార్టీ నిబడటం కోసం పాదయాత్ర చేస్తోంది. ఒక మహిళగా షర్మిల పాదయాత్ర సాహసమనే చెప్పుకోవాలి.
ఏడాదిపాటు సాగే షర్మిల పాదయాత్రను తక్కువవగా చూడలేం. మగవారు పాదయాత్ర చేయడానికి, మహిళలు పాదయాత్ర చేయడానికి తేడా ఉంది. మహిళలు సహజంగానే పురుషుల కంటే సున్నితంగా ఉంటారు. వారికి ప్రకృతి సహజమైన కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటిని అధిగమించి పాదయాత్ర చేయడమంటే సాధారణ విషయం కాదు. ఏది ఏమైనా షర్మిల సాహసాన్ని మెచ్చుకోవాలి.
ఇక ఆంధ్రాలో వచ్చే ఎన్నికలకు సిద్దమవుతున్న జనసేన అధినేత కబ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళడానికి కొన్ని ప్లాన్స్ ఆలోచిస్తున్నాడు. వాటిల్లో బస్సు యాత్ర చేయాలనేది ఒకటి. పవన్ కళ్యాణ్ కూ ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉంది. ఒకవేళ అలా కానీ పక్షంలో ముఖ్యమంత్రిని డిసైడ్ చేసే శక్తిగా ఎదగాలనే కోరిక ఉంది.
వాస్తవానికి పవన్ కు సినిమా హీరోగా క్రేజ్ ఉంది. ఆయన పార్టీకి అంతో ఇంతో బలముంది. షర్మిల పార్టీ మాదిరిగానే ఆయన పార్టీలోనూ పెద్ద నాయకులు ఎవరూ లేరు. చేరికలు కూడా లేవు. బీజీపీతో పొత్తు ఉన్నా అది ఆయన ఎదుగుదలకు ఉపయోగపడేది కాదు. కాబట్టి పవన్ కూడా పాదయాత్ర చేస్తే ఆయన మరింత ఎలివేట్ అయ్యే అవకాశాలుంటాయి. ఏడాదిపాటు జనంలో ఉంటే దానివల్ల వచ్చే ఫలితం మరోలా ఉండొచ్చేమో. అందులోనూ పవన్ పరిస్థితి షర్మిల మాదిరిగా కాదు.
తనకు జనంలో క్రేజ్ ఉంది. ఇమేజ్ ఉంది. షర్మిలకు నాన్ లోకల్ (తెలంగాణా వ్యక్తి కాదు) అనే ముద్ర ఉంది. కానీ పవన్ కు ఈ స్టాంప్ లేదు. ఆయన బై బర్త్ ఆంధ్రా కాబట్టి పక్క లోకల్. అందులోనూ గత ఎన్నికల్లో పోటీ చేశాడు.
తెలంగాణలో ఆయన పార్టీ కార్యకలాపాలు లేవు. ఇవన్నీ పవన్ కు అడ్వాంటేజస్. కానీ ఆయన పాదయాత్ర గురించి ఆలోచించడం లేదు. బస్సు యాత్ర గురించి ఆలోచిస్తున్నాడు. గత ఎన్నికల్లోనూ అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయలేకపోయాడు. వ్యవధి లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వంటి వాటితో ఆయన ప్రచార సభలను కుదించుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి ఏడాదిన్నర ముందు నుంచే యాత్ర చేయాలని నిర్ణయించాడు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు బస్సు యాత్ర చేస్తే మంచి స్పందనే వచ్చింది. కాబట్టి అన్న చేసిన పని చేయడమే మంచిదని అనుకుంటున్నాడట. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు టచ్ అయ్యేలా యాత్ర చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మొదట్లో పాదయాత్ర చేయాలని అనుకున్నా సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని అనుమానంగా ఉందట. అభిమానులతో ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నాడు. అందుకే తన సోదరుడు చిరంజీవిలా బస్సు యాత్ర చేయడమే బెటర్ అని పవన్ కల్యాణ్ డిసైడ్ అయ్యాడని పార్టీ వాళ్ళు చెబుతున్నారు. 175 నియోజకవర్గాల్లో పర్యటన ఉండేలా ప్లాన్ చేయాలని పవన్ కల్యాణ్ తన టీంను ఆదేశించాడట.
ప్రతి నెల రెండు జిల్లాల చొప్పున ప్లాన్ చేయాలని ఆలోచన. దీంతో పవన్ కల్యాణ్ బస్సుయాత్రకు సిద్ధమవుతున్నట్లే తెలుస్తోంది. బస్సులోనే ఉండి ఎటువంటి వేదికలు లేకుండా ప్రసంగించే వీలుంటుంది. అందుకే బస్సు యాత్రకే పవన్ కల్యాణ్ మొగ్గు చూపాడు. తెలంగాణలో షర్మిలకు, ఆంధ్రాలో పవన్ కు ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాలి.