బీజేపీకి ఏపీ రాజకీయాలు కలసి రావడం లేదా అంటే జవాబు సులువే. ఏదో విధంగా ఏపీలో తన ఉనికిని రాజకీయంగా చాటుకుందామని కమలం పార్టీ వేస్తున్న ఎత్తులు ఎప్పటికపుడు చిత్తు అవుతున్నాయి. తెలుగుదేశంతో ఇప్పటికే పలు మార్లు కలసి విడిపోయిన బీజేపీ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనతో చేతులు కలిపింది.
రెండు పార్టీలు ఏపీలో వైసీపీకి సరైన ఆల్టర్నేషన్ అని కూడా గట్టిగా చెప్పుకుంది. అయితే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల తరువాత తత్వం బోధపడింది. మరో వైపు చూస్తే జనసేన పోకడలు కూడా బీజేపీని పూర్తిగా అయోమయంలోకి నెడుతున్నాయి.
బీజేపీ మా మిత్రపక్షం అయినంతమాత్రాన ఆ పార్టీ చేసే ప్రతీ దానికీ మేము గుడ్డిగా తల ఊపమని జనసేనకు చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ లేటేస్టుగా హాట్ హాట్ కామెంట్స్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కావడాన్ని జనసేన వ్యతిరేకిస్తోందని ఆయన చెప్పారు. ఈ విషయంలో తన ఆలోచనల మేరకే ముందుకు సాగుతామని అన్నారు. తమ సిద్ధాంతాలు వేరు అని కూడా ఆయన తేల్చేశారు.
ఇక పవన్ విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం అంటే అది కచ్చితంగా బీజేపీకి ఇబ్బందికరమే. మిత్రులమని ఎంత చెప్పుకున్నా బీజేపీ చేసిన పనిని పవన్ ఎండగట్టినట్లే. దీంతో పవన్ ఆవేశం ఎక్కడ తమ కొంప ముంచుతుందో అని కాషాయ పార్టీ తెగ కలవరపడుతోంది. విశాఖలో మూడు రోజుల పాటు మకాం వేయబోతున్న పవన్ బీజేపీని హై బీపీని తెప్పిస్తారా అన్న చర్చ అయితే ఉంది. మొత్తానికి మిత్రుడి తీరు బీజేపీకి యమ టెన్షన్ తెప్పించేలా ఉందిట.