కుప్పం పర్యటన విషయంలో చంద్రబాబు తొందరపడ్డారా.. అనవసరంగా కుప్పం మున్సిపల్ ఎన్నికల ముందు వెళ్లి ఆవేశపడ్డారా. రేపు ఎన్నికల్లో ఏదైనా తేడా కొడితే.. బాబు వచ్చినా దిక్కులేదు అనే ప్రచారం మొదలవుతుంది. ఇన్నాళ్లూ బోసిడికే హడావిడిలో ఉన్న బాబు.. ఇప్పుడిలా కుప్పం వెళ్లి తన పతనానికి తానే రిబ్బన్ కట్ చేసుకున్నట్టుగా ఉంది.
పట్టాభితో చేయించిందంతా చేయించి, ఆ సాకుతో హడావిడిగా ఢిల్లీ వెళ్లొచ్చిన బాబు.. ఆ తర్వాత ఎక్కడా ల్యాగ్ లేకుండా రాజకీయాలు చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా కుప్పంలో పర్యటించారు. కుప్పం నుంచి చంద్రబాబు రాష్ట్ర యాత్రలకు శ్రీకారం చుడతారనే బిల్డప్ ఇచ్చారు.
అయితే కుప్పం మున్సిపాల్టీకి కాస్త ఆలస్యంగా ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ముందస్తుగా బాబు అక్కడ పర్యటించి ఓ అంచనాకు వచ్చారు. కుప్పంలో టీడీపీ శ్రేణుల్లో కాస్త చురుకు పుట్టించే ప్రయత్నం చేశారు. మున్సిపాల్టీ ఎన్నికల్లో అన్ని వార్డులు టీడీపీకే ఇవ్వాలని అభ్యర్థించారు. పనిలో పనిగా తనమీద బాంబులేసేందుకు వైసీపీ కొంతమందిని అరేంజ్ చేసిందని కూడా డ్రామాలాడే ప్రయత్నం చేశారు. సింపతీ కోసం విపరీతంగా ట్రై చేశారు.
అంత చేసినా ఫలితం ఉంటుందా..?
చంద్రబాబు కుప్పం పర్యటన ఒక రకంగా సక్సెస్ అయిందనే చెప్పాలి. స్థానిక నేతలు జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపించకుండా బాగానే జాగ్రత్తపడ్డారు. ఈ దఫా కూడా బాబుకి ఎన్టీఆర్ సెగ తగులుతుందని అనుకున్నా అది కుదరలేదు. దీంతో ఒక రకంగా బాబు హ్యాపీ.
అయితే మున్సిపాల్టీ ఎన్నికల కోసం ముందుగానే ఎగురుకుంటూ వచ్చిన బాబుకి స్థానిక ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారో తెలియంది కాదు. కానీ 2024లో తనకి కుప్పం కరెక్టా కాదా అనేది ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో బేరీజు వేసుకోవాలనుకుంటున్నారు చంద్రబాబు.
అందుకే ఆయన ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అనుకున్నట్టుగానే మున్సిపల్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి కుప్పంలో టీడీపీ జెండా ఎగిరితే.. వచ్చే ఎన్నికల వరకు నింపాదిగా ఉండొచ్చు. తేడా కొడితే మాత్రం బాబు ఇప్పటినుంచే కొత్త నియోజకవర్గం వెదుక్కోవాల్సిన పరిస్థితి.
ఇంతా చేసి చంద్రబాబు ప్రచారం తర్వాత కూడా కుప్పంలో టీడీపీకి సీట్లు రాకపోతే అది మరింత అవమానం. ఈ విషయంలో బాబు కాస్త తొందరపడ్డారనే అనిపిస్తోంది.