బీసీ కమిషన్ చుట్టూ డెబ్బై కులాలు…

ఈ దేశంలో వెనకబాటుతనం ఉంది. ఆ మాటకు వస్తే ప్రపంచంలో కూడా అన్ని చోట్ల అది ఉంది. దానికి కారణం సామాజికంగా ఆర్ధికంగా కొన్ని వర్గాలు ఈ రోజుకూ అణగారిపోయి ఉండడమే. ఈ దేశానికి…

ఈ దేశంలో వెనకబాటుతనం ఉంది. ఆ మాటకు వస్తే ప్రపంచంలో కూడా అన్ని చోట్ల అది ఉంది. దానికి కారణం సామాజికంగా ఆర్ధికంగా కొన్ని వర్గాలు ఈ రోజుకూ అణగారిపోయి ఉండడమే. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడున్నర పదుల కాలం గడచిపోయినా వెనకబడిన వారిలో ఏ కొందరినైనా ముందుకు తీసుకురాలేకపోయారా అన్న సందేహం అయితే అందరిలో ఉంది.

తాజాగా విశాఖపట్నంలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ అంబటి శంకర నారాయణ పర్యటించారు. ఆయన ముందు వెల్లువలా వినతులు వచ్చిపడ్డాయి. దాదాపుగా డెబ్బైకి పైగా బీసీ కులాల నుంచి సమస్యలు వచ్చి చుట్టు ముట్టాయి. ఇందులో అత్యధికం తీసుకుంటే తమ కులాన్ని బీసీ డీ నుంచి ఏ లోకి మార్చమని అలాగే మరింత ముందుకు తీసుకురమ్మని వచ్చిన విజ్ఞాపనలే ఎక్కువగా ఉన్నాయి.

అలాగే తమను కూడా బీసీలలో కలపమని  మరికొన్ని ఇతర వర్గాల తరఫున  విన్నపాలు వచ్చాయి. ఇవన్నీ చూస్తూంటే వెనకబాటుతనం ఇంకా ఈ దేశంలో ఎంత పెరిగింది అన్నదే అందరికీ అర్ధమవుతోంది. 

ఈ మధ్యలో వచ్చిన  ప్రభుత్వాలు, ఎన్నో  బడ్జెట్లు కూడా ఖర్చు పెడుతున్నా కూడా వెనకబాటుతనాన్ని రూపుమాపలేకపోవడం బాధాకరం అనుకుంటే నిన్నటి దాకా బాగా ఉన్నారు అని అనుకున్న వర్గాలు సైతం తాము వెనకబడిపోయామని చెప్పుకోవడం, తమను కూడా బీసీల జాబితాలో చేర్చాలని కోరడాన్ని చూస్తూంటే పాలనకు, పాలితులకు మధ్య అతి పెద్ద అంతరాయమే ఉన్నట్లుగా కనిపిస్తూంది. అలాగే ఫలాలు కూడా దక్కని వారున్నారా, దక్కినా పూర్తిగా వారికి సరిపోవడం లేదా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది.

మొత్తానికి చూస్తే రాష్ట్రంలో బీసీలకు ఎంతో మెరుగైన జీవితాన్ని అందిస్తామని కమిషనర్ శంకర నారాయణ చెప్పారు. తమ కమిషన్ దృష్టికి వచ్చిన ప్రతీ విన్నపాన్ని కూడా పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పారు. మొత్తానికి వెనకబాటుతనం ఏ దేశానికి మంచిది కాదు, అన్ని వర్గాలను ముందుకు తీసుకువచ్చేలా ఇకనైనా కార్యక్రమాలు రూపకల్పన చేయాలని  మాత్రం మేధావి వర్గం గట్టిగా కోరుతోంది.