ఒకటో తేదీ వస్తే ఇంటి అద్దెలు, ఇతర బిల్లులు ఎలా ఉంటాయో.. కొన్ని మార్పుచేర్పులు కూడా ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు దృష్టిలో పెట్టుకుంటే రొటీన్ లైఫ్ సాఫీగా సాగిపోతుంది. లేదంటే ఆ టైమ్ కు ఇబ్బందులు పడతాం. మరి రేపట్నుంచి (నవంబర్ 1) ఎలాంటి మార్పుచేర్పులు రాబోతున్నాయి.
ప్రతి ఇంటికి అత్యవసరమైన గ్యాస్ సిలిండర్ డెలివరీకి సంబంధించి రేపట్నుంచి ఓ కీలకమైన మార్పు అమల్లోకి రాబోతోంది. ఇకపై వినియోగదారులంతా గ్యాస్ సిలిండర్ డెలివరీ టైమ్ లో ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. దీన్ని డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ) అంటారు. గ్యాస్ ఇంటికొచ్చే ముందు ఈ కోడ్ వస్తుంది, అది చెబితే గ్యాస్ డెలివరీ ఇస్తారు. లేదంటే కష్టమే.
దీంతో పాటు ఎల్పీజీ (గ్యాస్ సిలిండర్) ధర ఎప్పట్లానే ఈసారి కూడా పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా ప్రతి నెల గ్యాస్ రేట్లు సవరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రేపు కూడా గ్యాస్ ధర పెరిగే అవకాశం ఉంది. ఈసారి టాక్ ఏంటంటే.. గ్యాస్ ధర అమాంతం పెరుగుతుందట. దీనికి కూడా మానసికంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉంటే మంచిది.
ఇక రేపట్నుంచి కొన్ని బ్యాంకు లావాదేవీల్లో కూడా మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ బరోడానే తీసుకుంటే, డిపాజిట్లు, విత్ డ్రాలపై రేపట్నుంచి ఈ బ్యాంక్ కొత్త ఛార్జీల్ని అమల్లోకి తీసుకొస్తోంది. చెప్పిన లిమిట్ దాటి డబ్బులు వేసినా, తీసినా (ఏటీఏం నుంచి కాదు) ఛార్జీల మోత మోగనుంది. సేవింగ్స్, శాలరీ ఎకౌంట్లు అన్నింటికీ ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి. అంతేకాదు.. ఇదే బాటలో యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ కూడా ఉన్నాయి. వాటి కొత్త రూల్స్ కూడా నవంబర్ లోనే అమల్లోకి వచ్చేలా ఉన్నాయి.
రేపట్నుంచి కొన్ని రైళ్లకు సంబంధించి టైమ్ టేబుల్ కూడా మారబోతోంది. దేశవ్యాప్తంగా రేపట్నుంచి 13వేల పాసింజర్ ట్రైన్లు, 7వేల గూడ్స్ ట్రైన్స్ టైమింగ్స్ మారుతున్నాయి. వీటిలో 30 రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి. రేపట్నుంచి రైలు ప్రయాణం చేసినప్పుడు కాస్త కొత్త టైమింగ్స్ చెక్ చేసుకొని వెళ్తే మంచిది.
ఇక మన జీవితాల్లో భాగమైన వాట్సాప్ లో కూడా రేపట్నుంచి ఓ పెను మార్పు రాబోతోంది. కొన్ని పాత మోడల్ ఫోన్లు, పాత వెర్షన్ సాఫ్ట్ వేర్లలో రేపట్నుంచి వాట్సాప్ పనిచేయదు. ఉదాహరణకు మీరు ఆండ్రాయిడ్ లో 4.0.3 వెర్షన్ లేదా, అంతకంటే పాత వెర్షన్ వాడుతున్నట్టయితే ఆ ఫోన్ లో రేపట్నుంచి వాట్సాప్ రాదు. ఐఫోన్లలో కూడా 6ఎస్, 6ఎస్ ప్లస్ మోడల్స్ లో సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేసుకోకపోతే రేపట్నుంచి వాట్సాప్ పనిచేయదు.