తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అవకాశవాదం గురించి కొత్తగా చెప్పేదేమీ ఉండదు. అయితే ఆయన అవకాశవాదానికి ఎప్పటికీ ఒక హద్దు ఉండదని మరోసారి ఆయనే స్పష్టతను ఇస్తూ ఉన్నారు. గతవారంలో చంద్రబాబు నాయుడు చేపట్టిన ఢిల్లీ పర్యటన, అక్కడ ఆయన జాతీయ మీడియా ప్రతినిధులతో చేసిన వ్యాఖ్యానాలను పరిశీలిస్తే.. బీజేపీ ప్రాపకం కోసం ఆయన ఎంతగా పాకులాడుతున్నారో చాటి చెబుతూ ఉంది.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది సహజంగా వినిపించే మాటే. అలాంటి విలువల్లేని వాటినే రాజకీయాలు అనుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడుకు మాత్రం మిత్రశత్రువులు ఏరోజుకారోజు, ఏ ఎలక్షన్ కా ఎలక్షన్ సందర్భంగా మారిపోతూ ఉంటారు. కేంద్రంలోని పార్టీలతో జత కట్టే విషయంలో అయినా, రాష్ట్ర స్థాయిలో పొత్తుల విషయంలో అయినా.. ఏ మాత్రం పట్టింపులు లేకుండా ఎప్పటికప్పుడు వారితో తన టర్మ్స్ ను మార్చేసుకోవడం చంద్రబాబు నాయుడు ఒక్కడికి మాత్రమే సాధ్యం అవుతూ ఉంది.
ఐదేళ్లకు ఒకసారి చంద్రబాబుకు మిత్రులు మారిపోతూ ఉంటారు. ఎన్నికల ఫలితాలకు ముందు స్నేహం చేసిన వారితో ఎన్నికల ఫలితాల తర్వాత స్నేహం చేస్తారనే నమ్మకాలు ఉండవు. తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ వేసి వెళ్లిన పునాదులను సొంతం చేసుకున్న చంద్రబాబు నాయుడు.. ఆ ఓటుబ్యాంకును అడ్డం పెట్టుకుని, అధికారమే పరమావధిగా, అడ్డగోలుగా వ్యవహరించడమే రాజకీయం అన్నట్టుగా టీడీపీని నడుపుతూ ఉన్నారు.
మరీ ఇంత పరమ అవకాశవాదాన్ని పాటించే రాజకీయ నేత ఇన్నాళ్లు రాజకీయ మనుగడలో ఉండటమే ఒక పెద్ద ఆశ్చర్యం కూడా. ఈ విషయంలో ఆయనకు మీడియా మేనేజ్ మెంట్ , సొంత కుల మీడియా సాయంగా నిలిచింది. అయితే రోజులు మారాయి. మీడియా చెబితేనే దేన్నైనా అర్థం చేసుకునే పరిస్థితులు పోయాయి. ప్రజల ఆలోచనా ధోరణి మారింది. మొన్నేం మాట్లాడారో నేతలు తమ కన్వీనెంట్ కోసం మరిచిపోవచ్చు గాక, ప్రజలు మరిచిపోయే పరిస్థితి లేదు. ప్రజలు మరిచిపోయే పరిస్థితి వచ్చినా.. వీడియోలు, ఆడియోలు, పేపర్ క్లిప్పింగ్ లు పదే పదే గుర్తు చేస్తూ ఉంటాయి.
ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు వంటి రాజకీయ అవకాశవాదుల ఆటకట్టు అవుతూ ఉంది. ఇదే చంద్రబాబునాయుడు 2019 ఎన్నికల ముందు మోడీని ఏమన్నారు, అమిత్ షాకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇచ్చారు, బీజేపీపై ఏమన్నారు, కాంగ్రెస్ తో చేతులు కలిపి ఏం కహానీలు చెప్పారు.. అనేవి చంద్రబాబు తన అవసరం మేరకు మరిచిపోయి ఉండవచ్చేమో కానీ, ప్రజలు మరిచిపోయే పరిస్థితి లేదు. గతంలో చంద్రబాబు నాయుడు ఇలాంటి ఆటలు ఆడితే అవి సాగాయి. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు వంటి రాజకీయ అవకాశవాదికి ప్రజాస్వామ్యంలో ఉనికే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి వచ్చింది.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు మళ్లీ ఆ అవకాశవాదాన్నే నమ్ముకున్నారు. గతంలో ప్రదర్శించిన అవకాశవాదానికి ఫలితంగానే 23 సీట్లకు టీడీపీ పరిమితం అయ్యే పరిస్థితి వచ్చిందనుకుంటే, ఇప్పుడు కూడా మళ్లీ అవకాశవాదాన్నే చంద్రబాబు నాయుడు అనుసరిస్తూ ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జత కట్టడానికి చంద్రబాబు ఆరాటపడుతున్నారు. ఢిల్లీ వెళ్లి.. ఎన్డీయేను ఏపీ ప్రజలు ఆశీర్వధిస్తారంటూ కొత్త కథ అల్లుతున్నారు. 2004 లో బీజేపీతో జతకట్టి ఓడిపోయాకా.. కమలం పార్టీని ఆయన నిందించారు.
బీజేపీతో దోస్తీ వల్లే ఏపీలో తమ పార్టీ ఓడిపోయిందన్నట్టుగా మాట్లాడారు. 2009నాటికి కూడా బీజేపీకి చెడుగా కనిపించింది. బీజేపీని, కాంగ్రెస్ ను అధికారంలోకి రానిచ్చేది లేదంటూ కమ్యూనిస్టులు-మూడో ఫ్రంటు అన్నారు. ఆ స్వప్నం కూడా చెదరడంతో..2014కు మళ్లీ బీజేపీనే దిక్కయ్యింది. మోడీ గాలి నేపథ్యంలో మళ్లీ పొత్తు. కలిసి పోటీ. 2019 ఎన్నికలు వచ్చే సరికి మోడీ హవా తగ్గిందనే లెక్కలు వేశారు. ఎన్నికలకు సమయం వచ్చాకా.. రాష్ట్రానికి అన్యాయం అంటూ బీజేపీతో తెగదెంపులున్నారు. ఏకంగా కాంగ్రెస్ తో జత కట్టారు. సోనియాను దెయ్యం, భూతం అని, తిరిగి అదే సోనియా ఇంటి ముందు పొత్తుల కోసం చంద్రబాబు ఎదురుచూశారు.
ఇప్పుడు మళ్లీ ఎన్డీయే అవసరం చంద్రబాబుకు ఏర్పడింది. ఎన్డీయేతో జతకలిస్తే మళ్లీ ప్రజలు అదరిస్తారంటూ కొత్త కహానీలు చంద్రబాబు ఢిల్లీలో అల్లి వచ్చారు. అయితే చంద్రబాబుకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే.. ఈ అవకాశవాద మాటలకు బీజేపీ పడుతుందేమో కానీ, ఏపీ ప్రజలు మాత్రం ఈ తీరుతో విసిగిపోయారనేది! ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న కహానీలకు మళ్లీ బీజేపీ ఆయనతో జత కలవొచ్చేమో! బీజేపీకి కూడా ఇలాంటివేమీ కొత్త కాదు.
చంద్రబాబుతో విడాకులు, మళ్లీ జత కలవడం ఇదంతా ఆ పార్టీకీ అలవాటే. ఆ అలవాటు మేరకు కమలం పార్టీ మళ్లీ టీడీపీతో కూడవచ్చేమో. అయితే ప్రజలో ధోరణి మాత్రం ఈ అవకాశవాద పొత్తులను, రాజకీయాలను ఆదరించే పరిస్థితుల్లో లేదు. ఈ అవకాశవాద రాజకీయం కనబరిస్తే.. ఏ పార్టీకి అయినా కాల్చి వాత పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు. ఈ విషయాన్ని అవకాశవాద రాజకీయాలను అనుసరించే వాళ్లు అర్థం చేసుకుంటే మంచిది.