ఇండియా, పాకిస్తాన్ ల మధ్య టీ20 వరల్డ్ కప్ లో జరిగిన లీగ్ మ్యాచ్ మతం రంగును పులుము కోవడం దురదృష్టకరం. ఇది ఎంత వరకూ వెళ్లిందంటే.. రాజకీయ నేతలు, ముఖ్యమంత్రులు కూడా ఆ మ్యాచ్ ఫలితం, తదనంతర పరిణామాల గురించి మాట్లాడేస్తూ ఉన్నారు! రేపోమాపో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో ఆ మ్యాచ్ అనంతర పరిస్థితులు పొలిటికల్ అజెండాగా కూడా మారినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేకుండా పోతోంది.
ఇండియా పాక్ మ్యాచ్ ఫలితం, తదనంతర పరిణామాలు ఇరు దేశాల్లోనూ చర్చనీయాంశంగా నిలిచాయి. ఈ విషయంలో పాకిస్తాన్ వైపు నుంచి అతి స్పందన వ్యక్తం అయ్యింది. ఈ విజయాన్ని ఇస్లాం విజయంగా పాక్ రాజకీయ నేతలు చెప్పుకున్నారు. వారే అతిగాళ్లు అనుకుంటే.. పాక్ మాజీ కెప్టెన్, మాజీ కోచ్ వకార్ యూనస్ స్పందిస్తూ.. హిందువుల మధ్యన తమ జట్టు క్రికెటర్ ఒకడు నమాజ్ చేయడం తనకు గర్వకారణంగా నిలిచిందన్నాడు.
పాకిస్తాన్ లో ఎవరో గల్లీల్లో క్రికెట్ ఆడుకునే వాడు ఇలా మాట్లాడితే అదో లెక్క. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తనకో స్థానం కలిగిన వకార్ ఒక జిహాదీలా మాట్లాడాడు. ఆ తర్వాత తన వ్యాఖ్యానం పట్ల విచారం వ్యక్తం చేశాడు. ఏదో భావోద్వేగం కొద్దీ అలా మాట్లాడినట్టుగా చెప్పుకున్నాడు. అయితే ఒక క్రికెటర్ భావోద్వేగం.. మతంతో ముడిపడి ఉంటుందా? అనే ప్రశ్నను రేపాడు వకార్. ఆటను అంతా కలిసి పోవడానికి సాధనంగా వాడుకోవాలి కానీ, విడదీయడానికి కాదని పలువురు క్రికెట్ వ్యాఖ్యాతలు పాక్ క్రికెటర్ కు హితవు పలికారు.
ఇక ఇండియాలో షమీని టార్గెట్ చేసుకుని కొందరు పోస్టులు పెట్టడం, ఇక పాక్ విజయాన్నిసెలబ్రేట్ చేసుకున్నారని కొంతమందిని అరెస్టు చేయడం వంటి జరిగాయి. పాక్ జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న కశ్మీర్ యువకులను అరెస్టు చేశారు. అరెస్టులు కూడా సమర్థనీయమే కానీ, దీన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది రాజకీయం చేయడానికి వెనుకాడకపోవడం శోచనీయం.
ఈ మతవిద్వేషాలనూ, చెత్త రాజకీయాలను పక్కన పెడితే.. ఇండియా, పాక్ మ్యాచ్ సందర్భంగా కొంత సహృద్భావ వాతావరణం కూడా కనిపించింది. అరబ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో స్టాండ్స్ లోని ముస్లిం వస్త్రాధారణలోని మహిళలు కొందరు భారత జాతీయ జెండాలతో కనిపించారు. ఒక ఇస్లామిక్ దేశంలో బతుకీడుస్తున్న వారు తాము భారతీయులమని మరవలేదనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఇక మ్యాచ్ తర్వాత ఇండో-పాక్ క్రికెటర్లు సరదాగా మాట్లాడారు, ఆట గురించి చర్చించుకున్నట్టుగా కనిపించింది.
ఇండియా, పాక్ కు క్రికెట్ పోరాటంలో ఇది మొదటిదీ కాదు, చివరిదీ కాకపోవచ్చు. ఇదే ప్రపంచకప్ లో మళ్లీ ఈ జట్లు తలపడే పరిస్థితి కూడా రావొచ్చు. కానీ ఎప్పుడూ ఏదో ఒక మత రాజకీయం జరుగుతూ ఉంటుంది. గతంలో ఇండియా చేతిలో ఓడిన మ్యాచ్ లో ఇస్లామిక్ సమాజానికి క్షమాపణలు చెప్పాడు ఒక పాక్ కెప్టెన్. దానిపై అనేక మంది ముస్లింలు ఘాటుగా స్పందించారు.
ఇస్లామ్ కు పాక్ ప్రతినిధి కాదు, పాక్ క్రికెట్ జట్టు ఇస్లామ్ కు ప్రతినిధి కాదు.. అని వారు కుండబద్ధలు కొట్టారు. ఇండియా, పాక్ ల మధ్య రెగ్యులర్ గా క్రికెట్ మ్యాచ్ లు జరిగినప్పుడు ఈ ఉద్రేకాలు కాస్త తగ్గుముఖం పడతాయి. ఇవి అరుదైన మ్యాచ్ లుగా మారడంతో… ఒక్కో మ్యాచ్ కే భావోద్వేగాలు తీవ్రం అవుతున్నాయనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.
ఇండియా, పాక్ క్రికెట్ మ్యాచ్ లు జరగడానికి అనేక అవంతరాలు ఉండవచ్చు గాక, అవి అవసరం కూడా కాకపోవచ్చు, కానీ క్రీడలతో సామరస్య వాతావరణం ఏర్పడాలి కానీ, ఉద్రేకాలు కాదు.