రికార్డు స్థాయిలో కరోనా కేసులు రిజిస్టర్ అవుతూ ఉన్నాయి.. అలాగే కరోనా రికవరీల విషయంలో కూడా కొత్త రికార్డులు నమోదవుతూ ఉన్నాయి. ఇదీ దేశంలో కరోనా విపత్తు పరిస్థితి. గత కొన్నాళ్లుగా.. దినవారీగా రోజుకు 50 వేల స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసులు ఒక్కసారిగా ఎగబాకాయి. గత 24 గంటలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఏకంగా 70 వేల స్థాయిలో దేశంలో కరోనా కేసులు రికార్డు అయ్యాయి.
ఇక ఇదే వ్యవధిలో రికవరీల సంఖ్య కూడా మెరుగయ్యింది. దాదాపు 60 వేల మంది కరోనా నుంచి కోలుకున్నట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇలా కొత్త కేసులు- రికవరీల మధ్యన వ్యత్యాసం మళ్లీ 10 వేల స్థాయికి చేరుకుంది.
కరోనా కారణ మరణాల రేటు రెండు శాతం లోపలే ఉంది. మామూలుగా చూస్తే రెండు శాతంలోపు అంటే తక్కువే. అయితే కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో.. రెండు శాతం లోపే అయినా ప్రతి రోజూ కరోనా కారణాలతో మరణిస్తున్న వారి సంఖ్య దాదాపు వెయ్యి స్థాయిలో నమోదవుతూ ఆందోళన రేపుతూ ఉంది.
దేశంపై ఇలా కరోనా పంజా ప్రభావం కొనసాగుతూ ఉంది. లాక్ డౌన్ లు దాదాపుగా ముగిసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఉదయం 11 తర్వాత షాపులను మూసేయిస్తున్నా ప్రజలు తమ అవసరాల మేరకు తిరుగుతూనే ఉన్నారు. మహానగరాల్లో లాక్ డౌన్ ల ఊసు లేదు. పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ లలో ప్రజలు ప్రయాణిస్తూ ఉన్నారు. కొత్త కేసుల సంఖ్యలో పెరుగుదల కూడా కొనసాగుతూ ఉంది.