ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా నిలిచారు. తన దాతృత్వంతో రియల్ హీరోగా అవతరించారు. ఇలాంటి వాళ్లు కోటి మందికి ఒక్కరున్నా…ఈ దేశం దిశ, దశ మారుతాయని అభిప్రాయపడే వాళ్లు లేకపోలేదు. మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అని మదర్‌థెరిస్సా స్ఫూర్తిదాయక సందేశం సోనూసూద్ విషయంలో నూటికి నూరు శాతం సరిపోతుంది.
ప్రస్తుతానికి వస్తే ఆయన సారీ చెప్పడం సోషల్ మీడియాలో మరోమారు ఆయన గురించి చర్చకు దారి తీసింది. సోనూసూద్ ఎంత సంస్కారో ఆయన చెప్పిన సారీనే చెబుతోంది. తనకొచ్చిన మెసేజ్‌లకు తిరిగి స్పందించక పోవడమే…ఆయన సారీ చెప్పడానికి కారణమైంది. ఈ పాటి సంస్కారం ఎంత మందికి ఉంటుంది? అందుకే సోనూసూద్‌ను ప్రతి ఒక్కరూ తమ గుండెల్లో దాచుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా సాయం చేయాలంటూ మెయిల్స్, ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టా ద్వారా తనకు వచ్చిన వినతులను సోనూ ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నారు. అందులో 1137 మెయిల్స్, 19 వేలు ఫేస్‌బుక్ మెసేజ్‌లు, 4812 ఇన్‌స్టా, మరో 6741 మెసేజ్‌లు ట్విటర్ ద్వారా వచ్చాయి. వీటిపై ఆయన స్పందిస్తూ.. “నాకు సహాయం చేయాలంటూ రోజూ వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న మెసెజ్‌లు. అందరి కష్టాలు తెలుసుకొని వారికి సహాయం చేయడం కొంచెం కష్టమే.. కానీ నా శక్తి మేరకు ప్రయత్నిస్తా. ఎవరివైనా మెసెజ్‌లు చూడకపోతే దయచేసి క్షమించండి” అంటూ ట్వీట్ చేశారు.
సంస్కారవంతంగా మెలగడం మాటలు చెప్పినంత ఈజీ కాదు. మనిషి అంటే ప్రేమ, గౌరవం ఉన్న వాళ్లు మాత్రమే సాటి మనిషి కష్టనష్టాలు, విజ్ఞప్తులపై స్పందిస్తారు. ఆ సుగుణాలు సోనూసూద్‌లో పుష్కలంగా ఉండడం వల్లే….నేడు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు.