బద్వేల్ పోలింగ్.. క‌నిపించ‌ని టీడీపీ ప్ర‌భావం!

2019 జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్ లో బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో న‌మోదైన పోలింగ్ శాతం 77.64. ఇక ఉప ఎన్నిక‌ పోలింగ్ దాదాపు ముగిసిన ద‌శ‌లో ఎన్నిక‌ల క‌మిష‌న్ వెల్ల‌డించిన స‌మాచారం ప్ర‌కారం.. రాత్రి…

2019 జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్ లో బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో న‌మోదైన పోలింగ్ శాతం 77.64. ఇక ఉప ఎన్నిక‌ పోలింగ్ దాదాపు ముగిసిన ద‌శ‌లో ఎన్నిక‌ల క‌మిష‌న్ వెల్ల‌డించిన స‌మాచారం ప్ర‌కారం.. రాత్రి ఏడుగంట‌ల స‌మ‌యానికి దాదాపు 68.12 శాతం పోలింగ్ న‌మోదు అయ్యింది. ఫైన‌ల్ నంబ‌ర్లు ఇంకా వెల్ల‌డి కావాల్సి ఉంది. ఒక శాతం అటో ఇటో ఉండ‌వ‌చ్చు ఫైన‌ల్ గా వెల్ల‌డించే పోలింగ్ ప‌ర్సెంటేజ్!

రాజ‌కీయ కోణం నుంచి చూస్తే.. ఇది కాస్త అనాస‌క్తితో కూడిన ఉప ఎన్నిక‌. అందుకు ప‌లు కార‌ణాలున్నాయి. ఈ అనాస‌క్తి స‌హ‌జంగానే పోలింగ్ శాతం మీద ప్ర‌భావం చూపించాల్సింది. ఒక‌వేళ టీడీపీ పోటీలో ఉన్నా.. ఉప ఎన్నిక కోసం అంటూ వేరే ప్రాంతాల నుంచి ఓటేయ‌డానికి వెళ్లే స్థానికులు త‌క్కువే ఉంటారు కాబ‌ట్టి.. పోలింగ్ శాతం త‌క్కువ‌గానే న‌మోదవ్వాల్సింది. 

మ‌రి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం పోటీ నుంచి త‌ప్పుకున్న ఉప ఎన్నిక లో ఏకంగా 68.12 శాతం పోలింగ్ న‌మోదు కావ‌డం విశేష‌మైన అంశ‌మే. బ‌హుశా ఏపీ రాజ‌కీయ చిత్రంలో టీడీపీ ప్రాధాన్య‌త త‌గ్గుతోందా? అనేందుకు చ‌ర్చ‌కు ఈ పోలింగ్ ప‌ర్సెంటేజ్ ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది.

2019 ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బ‌ద్వేల్ లో టీడీపీ 32 శాతం ఓట్ల‌ను పొందింది. మ‌రి టీడీపీ ఈ పోటీలో లేక‌పోవ‌డంతో… ఆ పార్టీ సంప్ర‌దాయ ఓట‌రు ఈ పోలింగ్ వైపు తొంగి చూసే అవ‌కాశాలు బాగా త‌గ్గాల్సింది! 32 శాతం ఓట్ల పార్టీ పోటీ నుంచి త‌ప్పుకోవ‌డంతో.. పోలింగ్ ప‌ర్సెంటేజీ క‌నీసం 20 శాతం వ‌ర‌కూ త‌గ్గాల్సింది. అయితే.. టీడీపీ త‌ప్పుకున్నా, జ‌న‌సేన దూరంగా ఉన్నా.. బ‌ద్వేల్ లో ఏకంగా 68 శాతం పోలింగ్ న‌మోదు అయ్యింది. 

మ‌రి ఈ ఓట్లు ఎటు ప‌డ్డాయ‌నేది.. ఫ‌లితాల‌తో తేలే క‌థ‌. అయితే బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌తో ఓట‌రు ఒక స్ప‌ష్ట‌మైన తీర్పును ఇచ్చాడు. టీడీపీ, జ‌న‌సేన‌లు ఎన్నిక‌ల‌కు, ప్ర‌త్య‌క్ష పోరాటాల‌కు దూరం అయినంత మాత్రానా.. పెద్ద ఎత్తున ఓట‌ర్లు బూత్ ల‌కు త‌ర‌లి వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గిపోవ‌నే క్లారిటీ వ‌స్తోంది. బ‌ద్వేల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ‌చ్చే మెజారిటీ పెరిగితే టీడీపీకి అది మ‌రింత డేంజ‌ర్ సిగ్న‌ల్! 77 శాతం పోలింగ్ న‌మోదైన‌ప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు 45 వేల ఓట్ల మెజారిటీ వ‌చ్చింది. ఇప్పుడు 69 శాతం పోలింగ్ నేప‌థ్యంలో.. ఎంత మెజారిటీ వ‌స్తుంద‌నేది కూడా ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం.