అతివినయాన్ని అదేదో లక్షణం అంటారు. ఆ మాటని మీ వయసుమీదున్న గౌరవం వల్ల వాడలేకపోతున్నాను.
మీరు జనం ముందు మరీ ఇంతిలా ఒంగిపోవడం మాత్రం చూడ్డానికి అస్సలు బాలేదు.
మీ మీద గౌరవం ఉన్నవాళ్లు బాధపడితే, మీ యాంటీజనాలు మాత్రం పిచ్చి పిచ్చి వెక్కిరింపు వీడియోలు షేర్ చేసుకుంటూ గడుపుతున్నారు.
మీ మీద నాకున్న అభిమానం గురించి తెలిసిన ఒకడు నాకు మీరు ఒంగి దండం పెడుతున్న ఫోటోని పంపి దాని కిందనే ఘరానా బుల్లోడు సినిమాలోని “ఒంగి ఒంగి దండమెట్టు రాజకీయ రంభరో…లింగు లింగుమంటు వచ్చె సంగతేంటో చూడరో” అనే పాట పంపాడు.
ఇలాంటివి మాకు అవసరమా చెప్పండి!?
సింహానికి వేటాడే ఓపిక లేకపోయినా గడ్డి తినదు. అప్పుడే దానిని సింహం అంటారు. మిమ్మల్ని సింహం అని నమ్మాము. కానీ మీరిలా దాసోహం అన్నట్టుగా ఒంగిపోవడం చూసి మేము నీరసించిపోతున్నాం. నాయకుడు ఒంగకూడదు, ప్రత్యర్థిని ఒంగదీయాలి.
మా వర్గం ఓట్లు ఎలాగూ మీకుంటాయి. కానీ ఇతరుల ఓట్లు పడాలంటే హీరోయిజం చూపించాలి. దానికన్నా ముందు మీరు మీ వీక్ పాయింట్స్ తెలుసుకోవాలి.
ఇప్పుడు మాటలతో మీరు నెగ్గలేరు. ఇక్కడ నోరున్నవాడిదే రాజ్యం. వైకాపా వాళ్ల నోళ్ల ముందు మీ మెతకతనం నిలబడలేదు.
ముఖ్యమంత్రిని బోసిడీకే అన్నందుకు పట్టాభికే కాకుండా మొత్తం తెదేపాకే చుక్కలు చూపించేసారు వాళ్లు. పట్టాభి జైలునుంచి బయటికొచ్చి మాల్దీవులకి పారిపోవాల్సి వచ్చిందంటే వాళ్ల తీవ్రత ఎలా ఉందో అర్థమవుతోంది.
కానీ మీరేం చేయగైగారు? ఆ వల్లభనేని వంశీ ఏకంగా లోకేష్ బాబు జన్మరహస్యం పేరుతో పిచ్చివాగుడు వాగితే కనీసం బదులు చెప్పే ప్రయత్నం కూడా చెయ్యలేదు. నోరు విప్పితే ఇంకేం విన్నల్సొస్తుందో అని భయం.
అంటే ప్రత్యర్థుల్లాగ భీభత్సం సృష్టించాలని నా పాయింట్ కాదు…బలంగా ఖండించగలిగే ఘాటైన మాటకారితనం మీ పార్టీలో ఎవ్వరికీ లేదు. మీరు భీభత్సమూ చెయ్యలేరు, గట్టిగా బదులూ చెప్పలేరు. జనం ఆల్రెడీ గాలిలేని సైకిల్ టైర్ ట్యూబుని చూస్తున్నట్టు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒంగి దండం పెడితే జనాలు సింపతీ చూపిస్తారని మీరు అనుకుంటున్నారా?
రూలింగ్ పార్టీ తప్పుల్ని ఎత్తి చూపడం, స్పీచుల్లో మీ అనుభవాన్ని చాటుకోవడం, సభల్లో ఇంతిలా ఒంగి దండం పెట్టడం అన్నీ శుద్ధ వేస్టు బాబు గారూ.
మీరు చెయ్యాల్సింది పాదయాత్ర. మీ వయసుకి సెట్ కాదనుకున్నా తప్పదు. అది కాక ఇంకేదీ మిమ్మల్ని జనానికి దగ్గర చెయ్యలేదు. మీ నుంచి హ్యూమన్ టచ్ అందితే తప్ప ప్రజలు మీ గురించి పట్టించుకోరు. ఎంత ఫ్యాక్షన్ ఫ్యామిలీ అని మీరు అరిచి గగ్గోలు పెట్టినా ఆ పాదయాత్రల వల్లే తండ్రీకొడుకులిద్దరూ ముఖ్యమంత్రులయ్యారు. మీరు మాత్రం పొత్తుల చాణక్యం వల్లే అయ్యారు. ఇప్పుడా పరిస్థితులు లేవు. కొన్ని విషయాలు ఒప్పేసుకుందాం. ఏం పర్లేదు.
శత్రువుని శత్రువు ఆయుధంతోనే ఎదుర్కోవాలి. వాళ్లు బాణలేస్తుండగా మీరు గద ఊపుకుంటూ కూర్చుంటే లాభం లేదు. అందుకే మీరు కూడా వాళ్ల మార్గంలోనే పాదయాత్ర చెయ్యండి..వచ్చే ఎన్నికల వరకు చేస్తూనే ఉండండి.
మీ కూడా లోకేష్ బాబుని తీసుకెళ్లినా ఆయన ఎక్కడో ఒక చోట మజ్జిగ తాగి “తియ్యగుంది”అని అనకుండా చూసుకోండి. ప్రశాంత్ కిషోర్ టీం కి టార్గెట్ లోకేష్ బాబే. మీ వారసుడిగా ఆయన ఏం చెయ్యాలా అని ఆలోచించక్కర్లేదు. ఏమీ చెయ్యకుండా ఉంటే చాలు. నోరు విప్పితే ఎటాక్ లకి గురౌతున్నప్పుడు సైలెంటుగా ఉంటేనే వయొలెంట్ గా ఉంటుందనే సూత్రాన్ని పాటించాలాయన.
గడప గడపకి వెళ్లి జనం గుండె తట్టండి. వాళ్లింట్లో వారిని పేరుపేరునా కుశల ప్రశ్నలేయండి.
వైకాపాని మీరు ఏమీ అనక్కర్లేదు. మీరు ఒంగి ఒంగి దండాలు పెట్టక్కర్లేదు.
మీరు మీ రూట్లో ఒక శాంతిదూతలాగ సాగిపోతే చాలు. జనం సైకిలుకేసి చూస్తారు. లేకపోతే ఫ్యాన్ కింద నుంచి పక్కకు రారు.
సురేష్ బాబు పర్వతనేని