పవన్ కాల్ కోసం ఏడాది వెయిట్ చేసిన రాజమౌళి

రాజమౌళి-మహేష్ బాబు కలిసి సినిమా చేస్తే చూడాలని చాలామందికి ఉంది. ఆ కోరిక త్వరలోనే తీరబోతోంది. ఇక రాజమౌళి-పవన్ కల్యాణ్ కలిసి ఓ సినిమా చేయాలని కూడా చాలామందికి ఉంది. అయితే ఆ కోరిక…

రాజమౌళి-మహేష్ బాబు కలిసి సినిమా చేస్తే చూడాలని చాలామందికి ఉంది. ఆ కోరిక త్వరలోనే తీరబోతోంది. ఇక రాజమౌళి-పవన్ కల్యాణ్ కలిసి ఓ సినిమా చేయాలని కూడా చాలామందికి ఉంది. అయితే ఆ కోరిక మాత్రం తీరదు. మా ఇద్దరి దారులు వేరు అంటూ రాజమౌళి విస్పష్టంగా ప్రకటించాడు.

“పవన్ కల్యాణ్, నాకు మధ్య ఓ సినిమా షూటింగ్ గ్యాప్ లో చర్చలు జరిగాయి. ఎలాంటి సినిమా కావాలో చెప్పాలని అడిగాను. నేను ఎలాంటి సినిమా అయినా చేస్తానన్నారు పవన్. నన్నే చెప్పమన్నారు. సరే సర్.. టైమ్ ఇవ్వండి. మీరు ఏ టైమ్ లో రమ్మంటే ఆ టైమ్ కు వచ్చి కథ చెబుతానన్నాను. ఆ తర్వాత ఏడాదిన్నర ఎదురుచూశాను. ఆయన దగ్గర్నుంచి కబురు రాలేదు.”

అలా పవన్ కల్యాణ్ కాల్ కోసం ఎదురుచూస్తున్న టైమ్ లోనే తన ఆలోచన విధానం మారిపోయిందన్నాడు రాజమౌళి. మగధీర, యమదొంగ, ఈగ లాంటి సినిమాలు చేస్తూ లార్జర్ దేన్ లైఫ్ కథల్ని ఎంచుకున్నానని తెలిపాడు.  

“ఆ టైమ్ లో నా ఆలోచన విధానం మారిపోయింది. మాస్ సినిమాలు మాత్రమే కాకుండా, కాస్త పెద్ద సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. మగధీర, యమదొంగ టైపు సినిమాల వైపు వెళ్లిపోయాను. ఈలోగా పవన్ కల్యాణ్ సినిమాల కంటే రాజకీయాలపై ఎక్కువగా ఆసక్తి చూపించారు. నాకు ఎక్కువ రోజులు షూటింగ్ చేయడం అలవాటు అయిపోయింది. అలా మా దారులు వేరయ్యాయి.”

భవిష్యత్తులో కూడా పవన్ తో సినిమా చేసే అవకాశం దాదాపు లేదని పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ దర్శకుడు.. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో చేయాల్సిన సినిమాపై దృష్టిపెడతాడు.