విశాఖలో పవన్ కల్యాణ్ ఉక్కు సభకు ఏపీ ప్రభుత్వం తొలుత అనుమతి నిరాకరించినా చివరకు పోలీసులు బహిరంగ సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ ఈరోజు ఏం చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సభకు అనుమతి లేకపోతే ఆ తప్పు ఎలాగూ రాష్ట్ర ప్రభుత్వంపై వేసి తప్పుకునేవారు పవన్. కానీ అనుమతి రావడంతో ఇప్పుడు ఆయన విశాఖ టూర్ కాస్త ఇంట్రస్టింగ్ గా మారింది.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తూ.. కేంద్రానికి పవన్ కల్యాణ్ అల్టిమేటం ఇస్తే గనక, కచ్చితంగా బీజేపీతో పవన్ వేరుదారులు పడినట్టే.
లేదూ.. కేంద్రాన్ని తాను ఒప్పిస్తానని, ఆ నమ్మకం తనకుందిని కబుర్లు చెబితే మాత్రం.. వెన్నువిరిగిందని ఒప్పుకున్నట్టే.. ఈ రెండిట్లో ఏది జరగబోతోందనేది మరికొద్దిసేపట్లో తెలుస్తుంది. జనసేన రాజకీయాలపై క్లారిటీ వస్తుంది.
పవన్ వాలకం తేడా కొడుతుందా..?
ఊరించి, ఉడికించి ఉసూరుమనిపించడం పవన్ కి అలవాటే. జగన్ పై నోరేసుకుని పడిపోతారు కానీ, టీడీపీని, బీజేపీని వ్యతిరేకించాల్సి వస్తే పవన్ కి నోరు పెగలదు. గతంలో చంద్రబాబు హయాంలో కూడా పవన్ ఇలాగే చేశారు. రాజధాని సమస్యల పరిష్కారం కోసం అంటూ సమావేశం పెట్టి బాధితులు తెచ్చిన పెరుగన్నం తిని షో చేసి వెళ్లిపోయారు.
నేనున్నాను, మీ తరపున పోరాటం చేస్తానని మాటలు చెప్పి తప్పించుకున్నారు. రైతులకు అండగా ఉంటానని చెప్పి, చంద్రబాబుకు అండగా నిలిచారు. అప్పట్లో చంద్రబాబుపై వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకే పవన్ కి ప్యాకేజీ ఇచ్చి పంపించారనే ప్రచారం జరిగింది.
ఇప్పుడు విశాఖ విషయంలో..
పాచిపోయిన లడ్డూలంటూ ప్యాకేజీని దునుమాడిన పవన్ కల్యాణ్.. బీజేపీతో పొత్తుకి మరోసారి రెడీ అయినప్పుడు అసలు ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కోరుకోవడంలేదని పెద్ద నింద వేశారు. తను పోరాటం చేస్తే తన వెనక ఎవ్వరూ రాలేదని ఆక్షేపించారు. ఇప్పుడు విశాఖ ఉక్కు విషయంలో కూడా పవన్ ఇలాగే కాడె పడేస్తారేమో చూడాలి.
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ మాటలు చెప్పి.. చివరకు విశాఖ వాసులు తమకు ఉక్కు పరిశ్రమ వద్దంటున్నారంటూ పవన్ నిందలు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. లేదంటే తను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముందుకొస్తే తన వెంట ఉద్యోగులెవ్వరూ రాలేదని మాటమార్చినా మార్చొచ్చు.
జాతీయ జెండాకు ఉన్నంత పొగరు ఉందా..?
తనకు ఒక దేశపు జాతీయ జెండాకు ఉన్నంత పొగరు ఉందని చెప్పుకునే పవన్ కల్యాణ్ నిజంగానే అంతటి ధిక్కార స్వరాన్ని వినిపించగలరా అనేది మాత్రం ఇప్పటివరకూ ప్రశ్నార్థకంగా మారింది.
నిజంగానే పవన్ కేంద్రంపై ధిక్కారం ప్రకటించి విశాఖ వాసులకు అండగా ఉంటే మాత్రం జనసేన కొత్త రాజకీయాల్లోకి అడుగు పెట్టినట్టే. మరి పవన్ తన కాషాయ ముసుగును ఈరోజు తీసేస్తారా, కొనసాగిస్తారా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.