సొంత ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేస్తున్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని పార్టీ నుంచి సాగనంపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని విశ్వసనీయ సమాచారం. గత కొంత కాలంగా జగన్ ప్రభుత్వంపై ఆనం రామనారాయణరెడ్డి ఘాటు విమర్శలు చేస్తున్నారు. పింఛన్ల మొదలుకుని అభివృద్ధి పనులపై ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర విమర్శలు చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కోపం తెప్పించినట్టు సమాచారం.
తాను ఎమ్మెల్యేగా ఉండగా, మరొకరు రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రచారం చేయడంపై కూడా ఇటీవల ఆనం విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆనం వ్యవహార శైలిపై వైసీపీ నేతలు జగన్‌కు నివేదించినట్టు తెలిసింది. వెంకటగిరిలో ఎమ్మెల్యేగా ఆనం ఉన్నప్పటికీ, ఆయన్ను పక్కన పెట్టి ఇన్‌చార్జ్‌ను నియమించాలని జగన్ పార్టీ పెద్దలను ఆదేశించినట్టు సమాచారం.
దీంతో వెంకటగిరి ఇన్చార్జ్గా నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డిని త్వరలో నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా సమాచారం. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, మాజీ మంత్రి రాజ్యలక్ష్మి తనయుడే రాంకుమార్‌రెడ్డి. ప్రస్తుతం తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్థానంలో రాంకుమార్‌రెడ్డి నియమితులయ్యారు. గూడూరు నియోజకవర్గంలోని విద్యానగర్‌లో ప్రముఖ విద్యాసంస్థను రాంకుమార్‌రెడ్డి నడుపుతున్నారు. వెంకటగిరికి రాంకుమార్‌రెడ్డిని ఇన్చార్జ్గా నియమించడం అంటే, ఆనంను పొమ్మనకుండా పొగ పెట్టడమే.