కేసీఆర్ పై సమైక్య ముద్ర …!

రాజకీయాల్లో ప్రత్యర్థులపై ముద్రలు వేయడం, ప్రతికూల ప్రచారం చేయడం చాలా సాధారణ వ్యవహారం. ప్రత్యర్థులను ఎలా దెబ్బ తీయాలా అని ఆలోచిస్తుంటారు. ఇందుకు ఉపయోగపడే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటారు. తాము చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు…

రాజకీయాల్లో ప్రత్యర్థులపై ముద్రలు వేయడం, ప్రతికూల ప్రచారం చేయడం చాలా సాధారణ వ్యవహారం. ప్రత్యర్థులను ఎలా దెబ్బ తీయాలా అని ఆలోచిస్తుంటారు. ఇందుకు ఉపయోగపడే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటారు. తాము చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మితే చాలనుకుంటారు. 

ప్రస్తుతం టీపీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ మధ్య టీఆర్‌ఎస్‌ ప్లీనరీ జరిగిన సంగతి తెలిసిందే కదా.  అందులో ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పట్టుకొని రచ్చ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే కుట్ర చేస్తున్నాడని ఆరోపించాడు. ఏపీ సీఎం జగన్ జైలుకు వెళితే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ కలలు  కంటున్నారని అన్నాడు.

కేసీఆర్ కు కేటీఆర్ కు, మంత్రులకు తమ పరిపాలనను పొగుడుకోవడం అలవాటు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు మెచ్చుకుంటున్నాయని, తమకూ ఇలాంటి పథకాలు ఉంటే బాగుంటుందని అంటున్నారని చెప్పుకుంటూ ఉంటారు. ఇందులో కొంత నిజం కూడా ఉండొచ్చు. 

ప్లీనరీలో కేసీఆర్ కొద్దిగా డోసు పెంచి ఏపీలో కూడా టీఆర్‌ఎస్‌ పోటీ చేయాలని, అలా చేస్తే తాము గెలిపించుకుంటామని అక్కడివారు అంటున్నారని కేసీఆర్ చెప్పారు. దీనిపై స్పందించిన ఏపీ మంత్రి పేర్ని నాని  ఏపీలో  కేసీఆర్ పార్టీ పెడతామంటే తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకని  ఏపీ, తెలంగాణను కలిపేసి కేసీఆర్ పోటీ చేస్తే ఇంకా బాగుంటుందన్నారు. అందరం కలిసి ఒకే రాష్ట్రంగా ఉండొచ్చని.. ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలన్నదే తమ సీఎం అభిమతం అంటూ చెప్పుకొచ్చారు.

అంతకు ముందు కేసీఆర్ ఏమన్నారంటే ….ఏపీలో పోటీ చేయాల‌ని కోరుతూ ప్ర‌తిపాద‌న‌లు వస్తున్నాయన్నారు. అదే స‌మావేశంలో పెట్టిన‌ ఫ్లెక్సీల్లో తెలంగాణ త‌ల్లి చిత్రాల‌కు బ‌దులుగా తెలుగు త‌ల్లిని పెట్ట‌డం స‌మ్‌థింగ్ రాంగ్ అనే డౌట్ క‌లిగించింది. అప్ప‌టికీ ఏదో పొర‌పాటున జ‌రిగి ఉంటుంద‌ని అంద‌రూ వ‌దిలేసినా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి బదులు తెలుగు తల్లి ఉండటం వెనుక పెద్ద కుట్రే ఉంద‌ని గట్టిగా వాదిస్తున్నాడు.   

ఏపీ, తెలంగాణ‌ను క‌లపాల‌ని తీర్మానం చేద్దామంటూ ఏపీ మంత్రి పేర్ని నాని మాట్లాడ‌టంతో  రేవంత్ రెడ్డి కుట్ర జరుగుతోందని అంటున్నాడు. ఏపీ, తెలంగాణ‌ను క‌లిపేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నార‌ని చెప్పేందుకు ఈ సాక్ష్యం చాల‌దా అని ప్రశ్నిస్తున్నాడు. 

కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నాడు. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం…మంత్రి పేర్ని నానీ “సమైక్య రాష్ట్ర” ప్రతిపాదన తేవడం…కేసీఆర్, జగన్ ల “ఉమ్మడి” కుట్ర అంటున్నాడు.  వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా హెచ్చరించాడు. 

కేసీఆర్ చెప్పుకున్న గొప్పలను ఇలా దారి మళ్ళించాడు రేవంత్. అంటే కేసీఆర్ సమైక్యవాది అని చెబుతున్నాడన్న మాట. తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ కదా. తాము రాష్ట్రం ఇస్తే కేసీఆర్ మళ్ళీ ఉమ్మడిగా చేయడానికి చూస్తున్నాడని అంటున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఆయన మాటలను ఎవరూ నమ్మరు. మళ్ళీ కలపాలని అనుకుంటే అసలు ఉద్యమం చేయడమెందుకు ? రాష్ట్రాలను విడదీయడం, కలపడం సులభమని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడా ?