స్లోగన్ మారింది.. మరి బాబు తలరాత మారుతుందా?

జాబు రావాలంటే బాబు రావాలి.. 2014లో టీడీపీ స్లోగన్ ఇది. అప్పట్లో అది బాగానే పనిచేసింది. ఆ తర్వాత 2019 ఎన్నికల నాటికి “మీ భవిష్యత్తు – నా బాధ్యత” అనే నినాదాన్ని ఎత్తుకుంది…

జాబు రావాలంటే బాబు రావాలి.. 2014లో టీడీపీ స్లోగన్ ఇది. అప్పట్లో అది బాగానే పనిచేసింది. ఆ తర్వాత 2019 ఎన్నికల నాటికి “మీ భవిష్యత్తు – నా బాధ్యత” అనే నినాదాన్ని ఎత్తుకుంది టీడీపీ. అభివృద్ధికి ఓటేయండి అంటూ బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్లారు, 

బొక్కబోర్లా పడ్డారు. తీరా ఇప్పుడు మళ్లీ 2024కి ఓ కొత్త స్లోగన్ అందుకున్నారు. “మళ్లీ నువ్వే రావాలి” అనే స్లోగన్ తో అప్పుడే టీడీపీ జనాలు క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. 2019లో కూడా ఈ స్లోగన్ అక్కడక్కడ వినిపించినప్పటికీ.. ఈ సారి రాష్ట్రమంతా ఇదే కామన్ స్లోగన్ కాబోతోంది. ఇప్పటికే టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఈ హ్యాష్ ట్యాగ్ ని బాగా పాపులర్ చేస్తోంది.

అన్నొస్తున్నాడంటూ 2019లో వైసీపీ అదరగొట్టింది. సోషల్ మీడియాలో జగనన్న అనే పేరుతో వచ్చిన హ్యాష్ ట్యాగ్ లకు కొదవే లేదు. ఆ స్థాయిలో టీడీపీ ప్రచారం చేసుకోలేక డీలా పడింది. ఈసారి మాత్రం ముందుగానే స్లోగన్ ఫిక్స్ చేశారు. మరీ ఎక్కువగా కష్టపడకుండా.. మళ్లీ నువ్వే రావాలి అంటూ హడావిడి మొదలు పెట్టారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో కూడా ఈ నినాదాలు మారుమోగాయి. అయితే స్లోగన్ మారితే బాబు తలరాత మారుతుందా అనేది ఇక్కడ ప్రశ్న.

మళ్లీ నువ్వే అంటే.. మళ్లీ జగనేనా..?

మళ్లీ నువ్వే రావాలి అని అంటే.. మళ్లీ జగనే రావాలి అనే మీనింగ్ వస్తుందని కూడా టీడీపీలో కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ బాబుకి అంతకు మించిన ఆల్టర్నేట్ దొరకడం లేదు. 2014 నుంచి 2019 వరకు బాబు ఏపీలో చేసిన అభివృద్ధి ఏంటో కూడా ఎవరికీ అంతు చిక్కడం లేదు. 

ప్రాజెక్ట్ లు పూర్తి కాలేదు, అమరావతి ఆగిపోయింది, ఎక్కడికక్కడ తాత్కాలికంగా పనులు మొదలుపెట్టి, హడావిడిగా పసుపు కుంకుమలు పంచేసి.. ఎన్నికలకు వచ్చారు చంద్రబాబు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఏమైనా చేశారా అంటే అదీ లేదు.

పోనీ అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో చెప్పగలరా అంటే అది కూడా కుదరని పని. జగన్ నవరత్నాలను మించి బాబు ఇంకేమైనా హామీ ఇవ్వగలరా..? ఇప్పటి పథకాలకే నిధులు లేక జగన్ కిందామీదా అవుతున్నారు. అంతకు మించి ఇంకేమైనా చేస్తామని చెప్పడం, చెయ్యడం చంద్రబాబుకి సాధ్యం కాని పని. ఒకవేళ బూటకపు హామీ ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకే టీడీపీ నాయకులు ఈ కామన్ స్లోగన్ అందుకున్నారు. మళ్లీ నువ్వే రావాలి అంటూ బాబు ఫొటో తగిలించుకు తిరుగుతున్నారు.

చినబాబు ప్రస్తావన లేనట్టే..

ఇదే స్లోగన్ లో మరో పరోక్ష అర్థం కూడా కనిపిస్తోంది జనాలకి. మళ్లీ నువ్వే రావాలి అంటే దానర్థం లోకేష్ వద్దని. టీడీపీ కొత్త స్లోగన్ తో చినబాబు ప్రస్తావన పూర్తిగా లేనట్టేనని తేలిపోయింది. 

నిజంగా లోకేష్ ని తెరపైకి తేవాలంటే.. రాబోయే తరానికి కాబోయే నాయకుడంటూ ఆయన ఫొటోతో టీడీపీ ప్రచారం చేసుకోవాలి. కానీ లోకేష్ కి అంత ప్రయారిటీ ఇవ్వడం లేదు కాబట్టి.. చంద్రబాబు పేరుతోటే టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. “మళ్లీ నువ్వే రావాలి” అంటూ కోరుకుంటోంది.