డ్రగ్స్ కేసులో అరెస్టై దాదాపు 27 రోజులు ముంబయి ఆర్థర్ రోడ్ జైళ్లో ఉన్న ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు బెయిల్ పై విడుదలయ్యాడు. ఫార్మాలిటీస్, పేపర్ వర్క్ అన్నీ పూర్తవ్వడంతో, ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తన నివాసం మన్నత్ లో అడుగుపెట్టాడు షారూక్ తనయుడు ఆర్యన్ ఖాన్.
ఆర్యన్ రాకతో మన్నత్ మొత్తం పండగ వాతావరణం సంతరించుకుంది. ఇంకా చెప్పాలంటే కొన్ని రోజుల ముందే మన్నత్ కు దీపావళి వచ్చేసింది. షారూక్ ఫ్యాన్స్ అంతా ఆర్యన్ కు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. డప్పులు కొట్టి తమ ఆనందం తెలియజేశారు. అన్ని మతాలకు చెందిన పెద్దలు వచ్చి మతప్రార్థనలు చేశారు. ఆర్యన్ మాత్రం ఎక్కడా ఆగలేదు. కారు నేరుగా ఇంట్లోకి వెళ్లిపోయింది. అట్నుంచి అటు నేరుగా తన బెడ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు ఆర్యన్.
ఆర్యన్ రాక సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు మన్నత్ కు రావడానికి సిద్ధమయ్యారు. కానీ షారూక్ అందర్నీ వారించాడు. కొన్ని రోజులు ప్రైవసీ కావాలని కోరాడు. ఆర్యన్ వచ్చిన టైమ్ కు షారూక్ ఇంట్లో జూహీచావ్లా మాత్రమే ఉంది. ఇంట్లో సంబరాలు కూడా ఏం జరగలేదు. ఆర్యన్ కు ఇష్టమైన మిఠాయిలు మాత్రం వండిపెట్టారట.
ఇదిలా ఉండగా.. రేపోమాపో ఆర్యన్ ఖాన్ కు పూర్తిస్థాయిలో వైద్యపరీక్షలు నిర్వహించబోతున్నారు. కంప్లీట్ హెల్త్ చెకప్ అయిన తర్వాతే ఆర్యన్ ఖాన్ ను పరామర్శించేందుకు షారూక్ అనుమతి ఇచ్చాడు. చివరికి ఆర్యన్ ఫ్రెండ్స్ ను కూడా కొన్నాళ్ల పాటు ఇంటికి రావొద్దని చెప్పేశాడు షారూక్. కొడుక్కి హెల్త్ చెకప్ తో పాటు.. ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇప్పించాలని, కొన్నాళ్ల పాటు ప్రత్యేకమైన డైట్ ప్లాన్ అమలు చేయాలని షారూక్ డిసైడ్ అయ్యాడు.
కొన్నాళ్ల పాటు ఆర్యన్ తన ఇంట్లోనే ఉండబోతున్నాడు. ఆ తర్వాత బయటకొస్తాడు. ముంబయి దాటి బయటకు వెళ్లడానికి ఆర్యన్ కు అనుమతి లేదు. అలా వెళ్లాలంటే ఎన్సీబీ అధికారుల అనుమతి తీసుకోవాలి. వీటితో పాటు ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య హాజరు వేయించుకోవాలి.