అప్పట్లో అచ్చెన్నాయుడికి కరోనా రావడానికి కారణం జగన్ అన్నారు, ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకడానికి కారణమూ జగనే అంటున్నారు. తప్పుచేసి జైల్లో ఊచలు లెక్కబెట్టుకుంటున్న నిందితులకు కరోనా వస్తే దానికి కారణం జగన్ ఎలా అవుతారు, ఎందుకు అవుతారు? కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు బెయిల్ పై విడుదలైన 24 గంటల్లో ప్రభాకర్ రెడ్డిని తిరిగి అరెస్ట్ చేశారని చంద్రబాబు చెబుతున్న మాటల్లో అసలు నిజం ఉందా?
జేసీ అరెస్ట్ కి నిబంధనల ఉల్లంఘన ప్రధాన కారణం కానే కాదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడి, ఎస్సీ పోలీస్ అధికారిపై జులుం చూపించిన ప్రభాకర్ రెడ్డి విన్యాసాలకు వీడియో సాక్ష్యాలూ ఉన్నాయి. ఏపీ మొత్తం అప్పట్లో సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసింది. వీడియో చూసిన అందరిదీ ఒకటే కామెంట్.. జైలు నుంచి విడుదలైన రోజే జేసీకి ఇంత ఓవరాక్షన్ అవసరమా అని. అంటే జేసీ నోరే ఆయన వీపుకి దెబ్బలు తెచ్చిందని అర్థమవుతోంది.
నిబంధనలు పాటించండి అని చెప్పిన పోలీస్ అధికారిపైకి జేసీ ఎందుకలా దూసుకెళ్లాల్సి వచ్చింది. జేసీ వ్యాఖ్యలతో ఆయన అనుచరులు మరింత రెచ్చిపోయారు. ఓ దశలో ఎస్సైపై దాడి చేస్తారా అనే అనుమానం కూడా వచ్చింది. అలా విధుల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ పై జులుం చలాయించడంతో పాటు.. ఎస్సీ అధికారిని బూతులు తిట్టి దూషించడంతో జేసీపై కొన్ని రోజుల కిందట అట్రాసిటీ కేసు నమోదైంది. మరి బాబు దీనికేమంటారు?
జేసీ ప్రభాకర్ రెడ్డి ఎస్సైపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు చంద్రబాబు సమాధానం చెప్పలేదు కానీ, ఆయనపై సింపతీ మాత్రం కురిపిస్తున్నారు. చేసిన పాపానికి బెయిలొచ్చినా, తిరిగి జైలుకే వెళ్లారు జేసీ. తిరిగి ఇప్పుడు కరోనా, ఇతర అనారోగ్య కారణాలు చూపిస్తూ బెయిలు తెచ్చుకున్నారు. ఆయనకు కరోనా రావడానికి కారణం జగన్ అయితే, బెయిల్ పై విడుదలవడానికి కూడా పరోక్షంగా జగనే కారణం అవుతారు.
ఇంతలా జగన్ ని విమర్శిస్తున్న బాబు.. నోటి దురుసు తగ్గించుకోవాలని జేసీ సోదరులకు ఎందుకు చెప్పడం లేదు. నోరు తెరిస్తే.. అమ్మ.. ఆలి బూతులు మాట్లాడే వారికి సభ్య సమాజంలో నాయకులుగా, ప్రజా ప్రతినిధులుగా చెలామణి అయ్యే అర్హత ఉందా? వీటికి చంద్రబాబే సమాధానం చెప్పాలి.