ఈ కాలంలో భారీ ఎత్తున అవినీతి చేసే ఉద్యోగులు చాలా మంది పట్టుబడుతూ ఉన్నారు. కొన్ని రకాల శాఖల్లో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు కదిలిస్తే.. వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడా బయటపడుతూ ఉంటాయి. ఆ ఆస్తులను సదరు అధికారులు తెలివిగా తమ బినామీల పేర్లతో దాచడాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. పిల్లనిచ్చిన మామల పేరిట, తమ దగ్గరి బంధువుల పేరిట తమ ఆస్తులను పెట్టి వాళ్లు బండిలాగిస్తూ ఉంటారు. ఎక్కడో వందల కిలోమీటర్ల అవతలి ఊర్లలో కూడా భూములు కొంటూ.. స్థానికంగా ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు.
అయితే వాళ్లను ఫాలో కాలేకపోయాడో ఏమో కానీ.. అనంతపురంలో ఒక ప్రభుత్వాధికారి తన భారీ ఆస్తులను ట్రంకుపెట్టెల్లో దాచుకున్నాడట. ఆ పెట్టెలు తన ఇంట్లో పెడితే డౌటొస్తుందని, తన డ్రైవర్ కు పిల్లనిచ్చిన మామ ఇంట్లో పెట్టాడట! ఈ అవకతవకల మేధావి కథాకమామీషు ఇలా ఉంది.. అనంతపురం ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేసే మనోజ్ కుమార్ అనే వ్యక్తి దగ్గర సుమారు మూడు కోట్ల రూపాయల విలువగల ఆస్తులను గుర్తించారట. నలభై యేళ్ల లోపు వయసున్న ఈ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మూడు కోట్ల రూపాయల ఆస్తులను వెనకేశాడంటే ఆయన సత్తా ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఇతడికి బైకుల, గుర్రాల పిచ్చి ఉందట.. లక్షల రూపాయల విలువైన బైకులు, గుర్రాల మంద.. దాన్ని పోషించడానికి భూమి.. ఇలా డబ్బును ఖర్చుపెడుతున్నాడట. ఆపై వెండి, బంగారు భారీగా కొన్నాడట. ఏకంగా రెండు కిలోలా 420 గ్రాముల బంగారం, 84 కేజీల వెండి కొని పెట్టాడట!
వెండి వస్తువులన్నింటినీ ట్రంకుపెట్టెల్లో సర్ది తన డ్రైవర్ మామగారింట్లో దాచాడట. దాచినందుకు వాళ్లకెంత ఇచ్చాడో కానీ.. ఇతడి బాగోతం అనూహ్యంగా బయటపడిందట. ఇతడి దగ్గర మారణాయుధాలు ఉన్నాయనే ఫిర్యాదు రావడంతో పోలీసులు ఇతడిపై కన్నేశారు. తీగ లాగితే డొంకంతా బయటపడినట్టుగా… ఈ వ్యవహారం అంతా బయటపడిందని సమాచారం.
అవినీతి అధికారులు చాలా మంది పట్టుబడుతూ ఉంటారు కానీ, ఇలా ట్రంకు పెట్టెల్లో ఆస్తులను దాచిన అధికారులు ఈ మధ్యకాలంలో వార్తల్లోకి రావడం లేదు. అలాంటి తీరుతో ఈ అధికారి ఆశ్చర్యపరుస్తున్నాడు!