సినిమా చేసే విషయమై ఓ పక్క సంబంధీకులతో చర్చలు సాగిస్తూనే, ఫైనల్ డెసిషన్ మాత్రం చెప్పకుండా మౌనంగా వున్నారు పవన్ కళ్యాణ్. కానీ మాదే సినిమా, కాదు ముందు మాదే అన్నట్లుగా కిందామీదా అయిపోతున్నారు నిర్మాత దిల్ రాజు-దర్శకుడు క్రిష్. అలా అని ఇద్దరిదీ ఒకే ప్రాజెక్టు కాదు. చెరో సినిమా.
క్రిష్ సినిమాకు నిర్మాత ఎఎమ్ రత్నం. దిల్ రాజు సినిమాకు దర్శకుడు ఎంపిక కావాలి. ఆస్థానంలో వున్న వేణు శ్రీరామ్ ఓ ఆప్షన్. కానీ అక్కడ వేరే విషయం వుంది. స్క్రిప్ట్ అందిస్తున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆమోదముద్ర పడాలి.
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం దిల్ రాజు నిర్మాణంలో పింక్ రీమేక్ నే ముందుగా పట్టాలు ఎక్కే అవకాశం వుంది. డిసెంబర్ లో ప్రారంభించి, 2020 సమ్మర్ విడుదల టార్గెట్ గా తయారుచేసే ప్లాన్ ఫైనల్ అయింది. క్రిష్ సినిమా కూడా ప్రారంభిస్తారు కానీ అది ఆ తరువాతే.
పింక్ సినిమాకు సంబంధించినంత వరకు ప్రాధమిక చర్చలు పూర్తయినట్లు బోగట్టా. అధికారికంగా అతి కొద్దిరోజుల్లో ప్రకటించే అవకాశం వుంది.